ఏపీ, తెలంగాణ‌లో దంచికొడుతున్న వాన‌

ఏపీ, తెలంగాణ‌లో దంచికొడుతున్న వాన‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఏపీ, తెలంగాణ (Telangana) రాష్ర్టాల‌ను వ‌రుణుడు ప‌గ‌ప‌ట్టాడా ఏంది అన్న‌ట్టు వాన‌లు కురుస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఎడ‌తెరిపి లేని వర్షం ప‌డుతుండ‌టంతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బంది ప‌డుతున్నారు. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడ‌టంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రాబోయే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో ఈదురు గాలుల భారీ వర్షం (heavy rain) కురిసే అవకాశం ఉంది.

శుక్ర‌వారం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. రానున్న నాలుగు రోజులు తెలంగాణలో ఇదే ప‌రిస్థితి ఉండే అవకాశం ఉంది.

త‌డిసి ముద్ద‌యిన న‌గ‌రం
హైదరాబాద్‌లో వర్షం (rain in Hyderabad) దంచికొడుతుంది. గురువారం (సెప్టెంబర్ 25) సాయంత్రం మొదలైన వర్షం ఎడతెరపి లేకుండా కురుస్తోంది. శుక్రవారం, ( సెప్టెంబర్ 26 ) కూడా వాన వ‌ద‌ల‌డం లేదు. అయితే భారీ వ‌ర్ష సూచ‌న ఉన్న నేప‌థ్యంలో ఇవాళ, రేపు ఐటీ ఉద్యోగుల ( IT employees)కు వర్క్ ఫ్రమ్ ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. ఎడతెరపి లేని వాన‌ల‌తో గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఏరియాల్లో ట్రాఫిక్ జామ్, వాటర్ లాగింగ్ సమస్యతో ఐటీ ఉద్యోగులు ఇబ్బంది ప‌డొద్ద‌ని ఈ సూచనలు చేశారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం (Andhra Pradesh state)లో రాబోయే రెండు రోజులు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి (Amaravati) వాతావరణ కేంద్రం, విశాఖ వెల్ల‌డించింది. శుక్ర‌వారం ( సెప్టెంబ‌ర్ 26) ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Leave a Reply