చింతూరు, ఆంధ్రప్రభ : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మన్యంలో మూడు రోజులుగా వర్షం ముసురుతో మన్యం తడిసి ముద్దైంది. వేసవి తరువాత జూన్ నెలలో ముఖం చాటేసిన వరుణుడు జూలై మొదటి రోజే దూకుడు పెంచాడు. గత మూడు రోజులుగా అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో క్షణం ఖాళీ లేకుండా మన్యాన్ని వీడకుండా వర్షం 24 గంటల కురుస్తూనే ఉంది. కుండపోతగా మారింది. ఇక మన్యంలో పనులకు అటంకం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

శబరి, సీలేరు నదుల్లో జలకళ
చింతూరు మండల కేంద్రానికి అనుకోని ప్రవహిస్తున్న శబరి నది, మండలంలోని ఆంధ్రా – ఒరిస్సా రాష్ట్రాల సరిహాద్దుల్లోని సీలేరు నదికి వరద నీరు చేరుతోంది. వేసవిలో శబరి నది తగ్గి వెల వెల పోయిన శబరి సీలేరు నదులు ఈ మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరద నీరు శబరి, సీలేరు నదుల్లోకి నీరు చేరుకొని నెమ్మదిగా నిండుకొని జలకళ సంతరించుకున్నాయి. ఈ క్రమంలోనే శబరి నది గురువారం ఉదయం నాటికి కనిష్ట నీటి మట్టానికి చేరుకుంది. ఒక్క రోజు వ్యవధిలోనే వరద నీరు శబరి నదికి చేరుకొని జలకళతో కళకళలాడుతుంది..
వాగులు వంకల పరవళ్లు

ఎడతెరిపి లేని వానతో వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఇప్పటీకీ సరైన వర్షం లేకపోవడంతో నిన్న, మొన్నటి వరకు ఇసుక మాత్రేమే కనిపించే వాగులు, వంకల్లో ఇప్పుడు వరద నీరుతో ప్రవహిస్తోంది. చింతూరు మండలంలోని శబరి నదికి అనుసంధానంగా ఉన్న సోకిలేరు, చంద్రవంక, అత్తకోడళ్ళు, జల్లివారిగూడెం, కుయుగూరు వాగులు వరద నీటీతో గుంభనంగా ప్రవహిస్తున్నాయి. మోతుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని పోల్లూరు జలపాతం ఈ వర్షాలతో జలకళతో నిండి ఉధృతంగా గుట్టల మీద నుండి జాలువారుతూ పరవళ్ళు తోక్కుతూ ప్రవహిస్తూ సుందరంగా కనిపిస్తోంది. మారేడుమిల్లి – చింతూరు ఘాట్ రోడ్‌లోని సోకిలేరు వాగు ప్రకృతి హోయల నడుమ మనోహారంగా ప్రవహిస్తుంది.

పాపికొండలు యాత్రకు బ్రేక్
ఏఎస్‌ఆర్ జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని దేవిపట్నం మండలం పూడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల గొందూరు ప్రసిద్ది పుణ్యక్షేత్రమైన గండిపోచమ్మ అమ్మవారి ఆలయం గోదావరి వరద ఆలయ ప్రాంగాణంలోకి చేరుకుంది. ఇది ఇలా పాపికొండల విహారయాత్రకు వరదలతో బ్రేక్ పడింది.