జన్నారం, (ఆంధ్రప్రభ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల టైగర్ రిజర్వ్‌లో భారీ వాహనాల రాకపోకలకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మంచిర్యాల డీఎఫ్ఓ శివ్ఆశిష్ సింగ్ (బుధవారం) పచ్చజెండా ఊపి శ్రీకారం చుట్టారు. మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని తపాల్‌పూర్ ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ 16 టైర్ల లారీకి పచ్చజెండా ఊపి, రూ.150 రుసుము చెల్లించి రసీదు తీసుకున్నారు. అనంతరం అదే లారీలో కూర్చుని జన్నారం వరకు ప్రయాణించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనుమతులు లభించిన నేపథ్యంలో భారీ వాహనాలను మోటారు వాహన చట్టం ప్రకారం నడపాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే భారీ లారీలు నడపాలని, అలాగే వైల్డ్‌లైఫ్ యాక్ట్ ప్రకారం తక్కువ వేగంతో ప్రయాణించి వన్యప్రాణులకు హాని కలిగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేను ఈ సందర్భంగా పలువురు సన్మానించారు.
కార్యక్రమంలో జన్నారం ఇన్‌చార్జి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వి. సుష్మారావు, తాళ్లపేట డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ చెట్ల సాగరిక, ఫారెస్ట్ సెక్షన్, బీట్ ఆఫీసర్లు నహీదా పర్వీన్, రైమోద్దీన్, కృష్ణమూర్తి, పద్మజరాణి, స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష తదితరులు పాల్గొన్నారు.