• ఇన్, ఔట్ ఫ్లో 73 వేల క్యూసెక్కులు…
  • గరిష్ట నీటిమట్టానికి ప్రకాశం బ్యారేజీ…
  • 70 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల…
  • అప్రమత్తమైన అధికారులు…
  • నదీ పరివాహక ప్రాంతాలలో రెడ్ ఎలర్ట్…

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : కృష్ణానది (Krishna River) ఎగువ ప్రాంతాల నుండి భారీ ఎత్తున వరద నీరు దిగువకు విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజ్ (Prakasam Barrage) కి పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తుతోంది. పులిచింతల ప్రాజెక్టు (Pulichintala Project) నుండి మంగళవారం సాయంత్రం దిగువకు మూడు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో బుధవారం ఉదయానికి వరద నీరంతా ప్రకాశం బ్యారేజీకి చేరుకోవడంతో ప్రస్తుతం బ్యారేజీ వద్ద గరిష్ట నీటిమట్టం (Maximum water level at the barrage) నమోదైంది.

ప్రకాశం బ్యారేజికి ఇన్, ఔట్ ఫ్లో 70వేల క్యూసెక్కులు ఉండగా, బ్యారేజీ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 3.07 టీఎంసీలకు చేరుకోవడంతో మిగులు జలాలను బ్యారేజీ 70గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 72 709 క్యూసెక్కులు ఉండగా, కృష్ణ తూర్పు మెయిన్ కెనాల్ కు 10,207 క్యూసెక్కులు, కృష్ణ పశ్చిమ మెయిన్ కెనాల్ కు 5527 క్యూసెక్కులు, గుంటూరు కెనాల్ కు 200 క్యూసెక్కులు నీటిని విడుదల చేయడంతో మొత్తం కెనాల్ కు 15,834 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజి గరిష్ట నీటిమట్టం 12 అడుగులకు చేరుకోవడంతో మొత్తం బ్యారేజీ 70 గేట్లకు గాను 15గేట్లు రెండు అడుగుల మేర, మిగిలిన 55 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి దిగువకు 60,875 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ప్రకాశం బ్యారేజ్ కి భారీ ఎత్తున వరద నీరు చేరుకోవడం, సముద్రంలోకి దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో అప్రమత్తమమైన అధికారులు ముందస్తు ఏర్పాట్లు ప్రారంభించారు. కృష్ణానది దిగువన ఉన్న పరివాహక ప్రాంతాలలోని ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు, ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు.

Leave a Reply