చూడముచ్చటైన రాఖీలు.. 50 వేల రకాలు
పెద్దపల్లి టూ ఫారిన్ దాకా సరఫరా
25 రాష్ట్రాలు, ఎనిమిది దేశాలకు సప్లయ్
ఏటా 3000 మందికి ఉపాధి
పెద్దపల్లి, ఆంధ్రప్రభ :
తోబుట్టువుల బంధానికి ప్రతీక రాఖీ. శ్రావణ పౌర్ణమి రోజున రంగురంగుల రాఖీలు కట్టించుకుని అన్నలూ తమ్ముళ్లూ మురిసిపోతారు. ఆ రోజున ధరించే రాఖీ తెలంగాణలోని పెద్దపల్లిలో తయారవుతందని అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. దక్షిణాదిలో ఏకైక రాఖీ తయారీ కేంద్రం ఇదే. సుమారు ముప్పయి వేల రకాల రాఖీలు తయారవుతున్నాయి. రూపాయి మొదలు అయిదు వందల వరకూ ధర పలుకుతున్నాయి. ధర తక్కువ, వైవిధ్యం ఎక్కువ.. ఇక్కడి రాఖీల ప్రత్యేకత. ప్రస్తుతం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్.. మార్గాల్లో వ్యాపారం జరుగుతుంది. ఆగస్టు 9న శ్రావణ పౌర్ణమి (రాఖీ పండగ) సందర్భంగా పెద్దపల్లిలో రాఖీలకు గిరాకీ పెరిగింది. అందుకు తగినట్లు సిద్ధం చేస్తున్నారు.
పదకొండేళ్ల క్రితం వరకు….
రక్షాబంధన్ వచ్చిందంటే రాఖీలకు గిరాకీ పెరుగుతుంది. పదకొండెళ్ల క్రితం వరకు కలకత్తా, రాజస్థాన్ నుంచి వచ్చే రాఖీలపై ఆధారపడేవారు. వారు చెప్పిన ధరలకు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అతి తక్కువ ధరకే పెద్దపల్లిలోని తయారవుతున్న అనేక రకాల రాఖీలు అందుబాటులోకి వచ్చాయి.
పెద్దపల్లి టూ ఫారిన్..
తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో రాఖీలు తయారు చేసే ఏకైక కేంద్రం పెద్దపల్లి. 2014 లో పెద్దపల్లిలో ఎస్‌ఆర్‌ఆర్ రాఖీ తయారీ కేంద్రాన్ని ఇల్లందుల కృష్ణమూర్తి ఏర్పాటు చేశారు. అనేక డిజైన్లలో తయారీ చేసి విక్రయిస్తున్నారు. ఇక్కడ నుంచి 25 రాష్ట్రాలకు రాఖీలు సరఫరా చేస్తున్నారు. అలాగే చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్నాటక, ఒడిశా, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతోపాటు అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా దేశాలతో పాటు ఎనిమిది దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. లండన్‌లోని ఎస్.మార్ట్‌లో ఎస్‌ఆర్‌ఆర్ రాఖీలను విక్రయిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి పెద్దపల్లికి రాఖీల కోసం వ్యాపారులు వస్తున్నారంటేనే ఇక్కడ రాఖీలు ఎంత ప్రసిద్ధో ఊహించుకోవచ్చు.
పది పైసల నుంచి… 500 రూపాయల వరకు
పెద్దపల్లి లోని ఎస్ఆర్ఆర్ రాఖీ సెంటర్ లో రాఖీలు పది పైసల నుంచి రూ. 500 ధరకు లభిస్తున్నాయి. సుమారు 50 వేల రకాల రాఖీలను తయారు చేసి విక్రయిస్తున్నారు. బార్ కోడింగ్ పద్ధతిలో బిల్లింగ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని దుకాణాలలో విక్రయించేందుకు ఈ ఏడాది పెద్ద ఎత్తున అక్కడి వ్యాపారులు పెద్దపల్లి రాఖీలను కొనుగోలు చేశారు. గతంలో రూ.10కి దొరికే రాఖీలు ప్రస్తుతం రూ.2కే దొరుకుతున్నాయి.
3000 మందికి ఉపాధి
పెద్దపల్లి కేంద్రంగా తయారవుతున్న రాఖీల వల్ల సుమారు మూడు వేల మంది మహిళలకు ఉపాధి కలుగుతుంది. ఒక్కో మహిళ రోజుకు రూ. 300 నుండి రూ. 800 వరకు సంపాదిస్తున్నారు. ఒక చిన్న పరిశ్రమలా రాఖీలను ఉత్పత్తి చేస్తున్నారు.
ధర తగ్గింది.. ఉపాధి పెరిగింది
- ఇల్లందుల కృష్ణమూర్తి, ఎస్‌ఆర్‌ఆర్ రాఖీ సెంటర్
పెద్దపల్లిలో రాఖీ తయారీ కేంద్రం నెలకొల్పడంతో గతంలో కంటే 70 శాతం ధరలు తగ్గాయి. ఎస్‌ఆర్‌ఆర్ సీజన్ సెంటర్‌లో హోల్‌సెల్, రిటైల్‌లో రాఖీలు విక్రయిస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుండి ముడి సరుకులు తీసుకువచ్చి రాఖీలు తయారు చేయడం వల్ల ఈ ప్రాంతంలోని మూడు వేల మందికిపైగా మహిళలకు గత కొన్నేళ్లుగా ఉపాధి కల్పిస్తున్నాం. జనవరి నుంచి ఆగస్టు వరకు 8 నెలలపాటు మహిళలకు ఉపాధి అవకాశాలు ఉంటాయి. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలో మహిళలకు రాఖీల తయారీపై ఉచిత శిక్షణ ఇప్పిస్తాం. గతంలో కలకత్తా నుంచి తెచ్చి రాఖీలను విక్రయించే వాళ్లం. ఇప్పుడు 25 రాష్ట్రాలకు సరఫరా చేస్తుండడం సంతోషాన్నిస్తోంది. రాబోయే ఏడాది దేశంలోని 29 రాష్ట్రాలకు రాఖీలను సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం.