Heat Wave Alert AP 2026 : ఆ 3 నెలలు యమ డేంజర్ Andhra Prabha news

Heat Wave Alert AP 2026 : ఆ 3 నెలలు యమ డేంజర్ Andhra Prabha news
- అధిక ఉష్టోగ్రత, వడగాల్పులు
- జనం జర భద్రం
- తాగునీటి ఎద్దడి రాకూడదు
- రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- వడగాల్పులపై ప్రజలకు జాగ్రత్త సూచనలు
- ఉపాధి కూలీలకు ప్రత్యేక మార్గదర్శకాలు
- పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలపై దృష్టి
- పశువుల రక్షణకు ముందస్తు ఏర్పాట్లు
- అన్ని శాఖల సమన్వయంతో చర్యలు
- ఇవి టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101
( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్)

రానున్నమూడు నెలలు అధిక ఉష్టోగ్రత, వడగాల్పుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వడగాల్పుల నుంచి ఉపశమనం పొందేందుకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.జయలక్ష్మి సూచించారు. రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్టోగ్రతలు, రానున్న రోజుల్లో సంభవించే వడగాల్పుల సన్నద్ధతపై ఆర్టీజిఎస్ నుంచి వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.
Heat Wave Alert AP 2026 ఇక ఎండల మంటే

ఈసందర్భంగా స్పెషల్ సిఎస్ జయలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 40 నుండి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయని రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఎండ తీవ్రత, వడగాల్పుల నుండి కాపాడుకునేందుకు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేలా ప్రజల్లో తగిన అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సహా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
Heat Wave Alert AP 2026 ఉపాధి కూలీలు జరభద్రం

ముఖ్యంగా ఉపాధి కూలీలు ఉదయం 11 లోపు పనిముగించాలని, పనిచేసే చోట్ల తాగునీరు, మజ్జిగ, టెంట్లు,ప్రధమ చికిత్స వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. అదే విధంగా ప్రస్తుతం విద్యార్ధులకు పరీక్షలు జరుగున్నందున ఆయా పరీక్షా కేంద్రాల వద్ద తగిన తాగునీరు,ఇతర సౌకర్యాలను కల్పించాలని అన్నారు. నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ట్రాన్సుకో అధికారులను జయలక్ష్మి ఆదేశించారు.
Heat Wave Alert AP 2026 తాగునీటి సమస్య జాగ్రత్త

ఆర్ డబ్ల్యూఎస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జలవనరుల శాఖ సమన్వయంతో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఎండల వల్ల పశువులకు ముప్పు కలగకుండా గ్రామాల్లోని నీటి తొట్టెలను ట్యాంకర్లతో నిరంతరం నింపాలని, పశు గ్రాసం విషయంలో రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య, విద్య, పంచాయితీరాజ్ , గ్రామీణాభివృద్ధి,రక్షిత మంచినీటి సరఫరా, కార్మిక, వ్యవసాయ, విద్యుత్, స్వర్ణ గ్రామ-వార్డు సచివాలయాల, నీటిపారుదల, ఫిషరీస్ తదితర విభాగాలు యాక్షన్ ప్లాన్ ప్రకారం అవసరమైన ముందు జాగ్రత్త చర్యలను తీసుకుని ప్రజలను పూర్తి అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
Heat Wave Alert AP 2026 హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్-26కు బీ అలెర్ట్

వడగాల్పుల కార్యాచరణ ప్రణాళికను(హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్-26) ప్రకారం తగు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర విపత్తుల సంస్థ, ఆర్టిజిఎస్, వివిధ శాఖలను సమన్వయం చేసుకోవడానికి స్టేట్, జిల్లా, డివిజన్ స్థాయిలో నోడలు అధికారిని నియమించుకోవాలని ఆదేశించారు. ఎండతీవ్రత జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వివిద ప్రచార మాధ్యమాల ద్వారా విస్త్రత ప్రచారం చేయాలని చెప్పారు. ఏఏ ప్రాంతాల్లో అధిక ఉష్టోగ్రతలు నమోదు అయ్యేది ముందుగానే ప్రజలకు సంక్షిప్త సందేశాలు జారీ చేయడం ద్వారా అప్రమత్తం చేయాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులను స్పెషల్ సిఎస్ ఆదేశించారు. ఎండలు రోజురోజుకీ పెరుగుతున్న క్రమంలో బయటకు వెళ్లేటప్పుడు ఎలాంటి రక్షణ లేకుండా వెళ్లవద్దని ప్రజలకు సూచించారు.ఎండా కాలంలో సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే 4 నుంచి 5.4 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదైతే ఆ పరిస్థితులను హీట్ వేవ్ అంటారని కొన్నిసార్లు అది 6.4 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా ఉంటే దానిని తీవ్రమైన హీట్ వేవ్ అంటారని పేర్కొన్నారు.
Heat Wave Alert AP 2026 బయటకు రావొద్దు

ఎక్కువ ఎండలో తిరిగి వడదెబ్బ తగిలితే శరీరంలో నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుందని,దాని వల్ల శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారని డాక్టర్లు తెలియ జేస్తున్నారని అన్నారు. వడదెబ్బ నుండి ఉపశమనం పొందేందుకు నీటిని అధికంగా తీసుకోవడంతో పాటు తేలికపాటి ఆహారం తీసుకోవాలని సూచించారు.ఎండ వేడిమి అధికంగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ప్రజలకు తెలియజేశారు. పళ్ల రసాలు తాగుతూ ప్రధానంగా శరీరం లవణాలను కోల్పోకుండా కాస్త ఉప్పు వేసిన ద్రవపదార్థాలు తీసుకోవాలని వేసవిలో కూల్ డ్రింకులు కాకుండా కొబ్బరి బొండం,మజ్జిగ వంటివి తీసుకోవడం మంచిదని ప్రజలకు సూచించారు.
Heat Wave Alert AP 2026 అప్పుడే 42.6 సెంటీగ్రేడ్ దాటింది

ఈసమావేశంలో రాష్ట్ర విత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఈనెల 12వ తేదీన అత్యధికంగా 42.6 సెంటీగ్రేడ్, 13న 42.4 సెంటీగ్రేడ్ ఉష్టోగ్రతలు నమోదు అయ్యాయని తెలిపారు. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈఏడాది మార్చి నుండి మే వరకూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం అధికంగా ఉందని తెలుస్తోందని వివరించారు. అధిక ఉష్టోగ్రతలు, వడగాల్పుల నుండి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై ఇప్పటికే Do’s, Don’t’s పై వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకున్నట్టు వివరించారు. అంతేగాక ఆర్టీజిఎస్, ఎస్డీఎంఏ నుంచి ఎప్పటికప్పుడు వాట్సప్,సోషల్ మీడియా ద్వారా అలెర్టులు జారీ చేస్తున్నట్టు ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు ఎండ తీవ్రత సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 నెంబర్లు సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సంపత్ కుమార్, ఎగ్జిగ్యూటివ్ డైరెక్టర్ వెంకట దీపక్, వివిధ శాఖల ఉన్నతాధికారులు అధికారులు పాల్గొన్నారు.
