ఆయన ఆశయాలను గుర్తు చేసుకుంటూ..

ఆయన ఆశయాలను గుర్తు చేసుకుంటూ..
నల్గొండ (ఆంధ్ర ప్రభ): దేశ సమగ్రత, ఐక్యత కోసం కృషి చేసిన గొప్ప దేశ భక్తుడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ అని జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవర్ (SP Sharath Chandra Pawar) అన్నారు. జాతీయ ఐక్యత దినోత్సవం, సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రన్ పర్ యూనిటీ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది, స్థానిక యువత, విద్యార్ధినీ విద్యార్థులు, ఇతర అధికారులు దాదాపు 500 మందితో కలిసి ఎన్ జి కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు దేశ సమైక్యతను పత్రిబింబించేలా ఉత్సాహంగా ఈ పరుగులో పాల్గొన్నారు.
అనంతరం సర్దార్ పటేల్ (Sardar Patel) చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎస్పీ శరత్ చంద్రపవర్ మాట్లాడుతూ.. భారత దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించి, 550 కి పైగా సంస్థానాలను భారత దేశంలో విలీనం చేయుటకు దృడ సంకల్పంతో ఎలాంటి ఒత్తిడికి లొంగకుండా కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయి పటేల్ అన్నారు.
అతని 150వ జయంతి సందర్భంగా మనందరం ఆయన ఆశయాలను గుర్తు చేసుకుంటూ దేశ సమగ్రత (National integrity), ఐక్యత దేశ భక్తితో కలిసి ఉంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. అనంతరం జాతీయ ఐక్యత దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డిఎస్పి శివరాంరెడ్డి, ఏఆర్ డిఎస్పి శ్రీనివాసులు, సిఐలు రాజశేఖర్ రెడ్డి, మహా లక్ష్మయ్య, జితేందర్ రెడ్డి, శ్రీను నాయక్, రఘువీర్ రెడ్డి ఆర్ ఐ లు సంతోష్, శ్రీను, సూరప్ప నాయుడు, హరిబాబు ఎస్సైలు సైదులు, గోపాల్ రావు మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
