HCU Lands | సిగ్గు లేనోడు కాబ‌ట్టే ఇంకా సిఎం ప‌ద‌విలోనే ఉన్నాడు – రేవంత్ పై కెటిఆర్ కామెంట్

హైద‌రాబాద్ – సుప్రీంకోర్టు ఆధికారులను జైలుకు పంపినా తప్పు కాదు” అన్న వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ, ఇది ప్రభుత్వానికి పెద్ద నింద అని పేర్కొన్నారు. అలాగే ఆత్మాభిమానమున్న ఏ సీఎం అయినా ఇలాంటి పరిణామాల అనంతరం రాజీనామా చేస్తారు. కానీ, రేవంత్ రెడ్డికి ఆత్మాభిమానమే లేదు అంటూ విమర్శించారు. హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఈ వివాదంలో పర్యావరణ ప్రేమికుల విజయం సాధించారని కేటీఆర్ అన్నారు. ఈ భూముల యాజమాన్యంపై స్పష్టత వచ్చే వరకూ కట్టడాలు నిర్మించకూడదు, లీజుకు ఇవ్వకూడదు అని సెంట్రల్ కమిటీ చెప్పింది. ఇది మేము గత వారం చెప్పిన మాటలే అని పేర్కొన్నారు.


సిఎం రేవంత్ చేసిన 10 వేల కుంభకోణం మీద తాము చెప్పిందే నిజమైందని కేటీఆర్ అన్నారు. హెచ్‌సీయూ భూములపై రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని వారం రోజుల క్రితమే చెప్పామన్నారు. సుప్రీంకోర్టు సాధికార కమిటీ హెచ్‌సీయూ భూములపై ఆర్థిక పరమైన అవకతవకలు, ఉద్దేశపూర్వకంగా చేసిన అరాచక పర్వంపై స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని నివేదిక ఇచ్చిందని వెల్లడించారు. ఈ రూ.10 వేల కోట్ల కుంభకోణం బయటకు రావాలంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆర్బీఐ కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు.

ముఖ్యమంత్రి కారణంగా చీఫ్ సెక్రటరీ, ఇతర అధికారులు బలవుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు ఐఏఎస్, అటవీశాఖ అధికారుల వంతు అయిపోయిందని… ఇతర అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కొందరు పోలీసులు రేవంత్ రెడ్డికి సైన్యంలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇష్టానుసారం కేసులు పెడుతున్నారని… అలాంటి అధికారులపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డికి ప్రైవేటు సైన్యంలా పని చేస్తున్న పోలీసులు ఊచలు లెక్కించాల్సి వస్తుందని హెచ్చరించారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు ఎండగట్టిందని తెలిపారు.

‘బుధవారం నాటి సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా ఉన్నాయి. అధికార మదంతో విర్రవీగుతూ.. మేమే నియంతలం, రారాజులం అని అనుకుంటున్న వారికి నిన్నటి సుప్రీం కోర్టు తీర్పు ఒక గుణ పాఠం. సుప్రీంకోర్టు ఆదేశాలతో వేరే ముఖ్యమంత్రి అయితే రాజీనామా చేసేవాడు. కానీ రేవంత్‌ రెడ్డికి సిగ్గు లేదు కాబట్టి దులుపుకొని పోతున్నడు. హెచ్‌సీయూ భూముల కోసం పోరాడిన విద్యార్థులు, సామాజికవేత్తలకు అభినందనలు. సెంట్రల్‌ ఎంపవర్డ్ కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు. కంచగచ్చిబౌలి భూమి వర్సిటీ ఆధీనంలో ఉన్నదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సాధికార కమిటీ చెప్పింది. ఆ భూములపై సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలని సూచించింది. నిన్న సుప్రీంకోర్టులో వాదోపవాదాలు విన్న సగటు పౌరుడికి న్యాయస్థానాల పట్ల మరింత గౌరవం పెరిగింది’ అంటూ వ్యాఖ్యానించారు.

ఇది ఉద్దేశ్యపూర్వక విధ్వంసమని, స్వతంత్ర విచారణ సంస్థల ద్వారా దీనిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ‘సీబీఐ, సీబీసీ లేదా సుప్రీంకోర్టు జడ్జీలతో విచారణ చేయించాలి. లేకుంటే మోడీ కూడా దీనిలో భాగం అనే అనుమానం ప్రజల్లో ఉత్పత్తి అవుతుంది అని హెచ్చరించారు. రోహిత్ వేముల ఘటన సమయంలో రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చారని గుర్తు చేసిన కేటీఆర్, ఇప్పుడు మాత్రం రాహుల్ గాంధీ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ‘ఎప్పుడు పిలిచినా వస్తానన్నవాడు ఇప్పుడు మొహం చాటేస్తున్నాడు అని విమర్శించారు.

గత ఏప్రిల్‌లో ప్రధాని మోడీ తెలంగాణలో ఆర్‌ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారన్నారు. ఏడాది తర్వాత అదే మోడీ పర్యావరణం పాడవుతోంది అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించాలి. సెంట్రల్ కమిటీ చెరువుల గురించి స్పష్టంగా మాట్లాడింది. చెరువుల్ని తాకట్టు పెడతారా అని ప్రశ్నించింది. బీజేపీకి చెందిన ఎబివిపి కూడా దీనిపై ఉద్యమం చేసిందని అన్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికే హెచ్చరికలు చేసింది. అయినప్పటికీ అత్యుత్సాహం చూపే అధికారులపై చర్యలు తీసుకోవాలని చూస్తున్నాం. అవసరమైతే మళ్లీ సుప్రీంకోర్టు వెళతాం అని ఆయన తెలిపారు. ఫార్ములా ఈ కేసులో తానే విధానపరమైన నిర్ణయం తీసుకున్నానని, . అధికారులపై త‌ప్పు ప‌డ‌నీయ‌లేద‌ని గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *