Hawala | హవాలా సొత్తు దోపిడీ..

Hawala | హవాలా సొత్తు దోపిడీ..
దారి మధ్యలో రూ.3కోట్లు చోరీ…
గుజరాత్ నుంచి బెంగళూరుకు తరలిస్తుండగా
పెనుకొండ వద్ద ఘటన
Hawala | శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : గుజరాత్ (Gujarat) రాష్ట్రం సూరత్ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు తరలిస్తున్న భారీగా హవాలా నగదు దోపిడీకి గురైన ఘటన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో గుర్తుతెలియని దుండగులు మూడు కోట్ల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. పక్కా ప్రణాళికతో, సినీ తరహాలో దోపిడీ జరగడంతో పోలీసులు, స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
వివరాల ప్రకారం… గుజరాత్లోని సూరత్ నుంచి రూ.4.20 కోట్ల నగదును ఒక ఇన్నోవా కారులో ఇద్దరు వ్యక్తులు బెంగళూరు (Bengaluru) కు తరలిస్తున్నారు. ఈ నగదు హవాలా లావాదేవీలకు సంబంధించినదిగా ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ముందుగానే సమాచారం అందుకున్నట్లు భావిస్తున్న దుండగులు నాలుగు కార్లలో వెంబడిస్తూ కిలోమీటర్ల కొద్ది ప్రయాణించారు. అనుకూల సమయం కోసం ఎదురు చూసిన దుండగులు పెనుకొండ సమీపంలో జాతీయ రహదారిపై ఇన్నోవా కారును అడ్డగించారు.
అకస్మాత్తుగా వచ్చి కారులోని వ్యక్తులను బెదిరించిన దుండగులు (thugs) నగదును జాగ్రత్తగా తీసుకున్నారు. కారులో ఉంచిన నగదులో నుంచి మూడు కోట్ల రూపాయలను దోచుకుని, వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు. అయితే డ్రైవర్ సీటు కింద ఉన్న గూడు (అర)లో దాచిన రూ.1.20 కోట్ల నగదు మాత్రం దుండగుల కంటపడకపోవడంతో అక్కడే మిగిలిపోయింది. ఆ ప్రాంతంలో నగదు ఉన్న విషయం తెలియకపోవడమే ఇందుకు కారణమని సమాచారం.
ఘటన అనంతరం బాధితులు వెంటనే స్థానిక పోలీసుల (police) కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగులు ఉపయోగించిన కార్లు, వారి మార్గం, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. వివిధ రాష్ట్రాల మీదుగా హవాలా నగదు తరలింపులు జరుగుతున్నాయా? ఈ దోపిడీ వెనుక అంతర్రాష్ట్ర ముఠా ఉందా? అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది.
ఈ ఘటనతో హవాలా (hawala) వ్యవహారాలపై మరోసారి చర్చ మొదలైంది. ఇంత భారీ మొత్తంలో నగదు రహస్యంగా తరలించడం, దుండగులకు ముందుగానే సమాచారం చేరడం వంటి అంశాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. పోలీస్ శాఖ ఈ కేసును అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తోంది. దుండగులను త్వరలోనే పట్టుకుంటామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
