చేనేత ఎక్స్‌లెన్స్ సెంటర్ పనులు..
కలెక్టర్ సిక్తాపట్నాయక్
నారాయణపేట ప్రతినిధి, అక్టోబర్ 23 (ఆంధ్రప్రభ ) : జిల్లాలో కొనసాగుతున్న చేనేత ఎక్స్‌లెన్స్ సెంటర్ నిర్మాణ పనులను నవంబర్ నెలాఖరుకల్లా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ (Collector SiktaPatnaik) అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపు దారి వద్ద వృత్తి నైపుణ్యాభివృద్ధి కేంద్రం పక్కన కొనసాగుతున్న నిర్మాణ పనులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్‌తో కలిసి పరిశీలించారు.
ఈసందర్భంగా కలెక్టర్ భవనంలోని డోర్స్, లైటింగ్, టాయిలెట్ బ్లాక్, ప్రహరీ గోడ వంటి మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సెంటర్ నమూనా మ్యాప్ (Center sample map) ను పరిశీలించి, డిజైన్ ప్రకారం పనులు నాణ్యతతో సాగాలని ఆదేశించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ టెస్కో ఓఎస్‌డీ హైదరాబాద్ రతన్‌కుమార్, మహబూబ్‌నగర్ చేనేత, జౌళి శాఖ ఏడి బాబు, టీజీఎంఎస్‌ఐడీసీ ఈఈ రవీందర్, ఏఈ సాయి మురారి, ఆర్కిటెక్ట్ ఇస్మాయిల్‌తో సమావేశమై సెంటర్ పురోగతిని సమీక్షించారు. “ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే నెలాఖరుకల్లా భవన నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలి” అని కలెక్టర్ స్పష్టం చేశారు.