Guntur | అంబటి వివాదంపై సీరియస్…

Guntur | అంబటి వివాదంపై సీరియస్…

  • అల్లర్ల అణచివేతలో పోలీసులు విఫలం అయ్యారంటూ ధ్వజం
  • టీడీపీలో కాక రేపుతున్న బోనబోయిన వ్యాఖ్యలు

Guntur | గుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో : గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబు వివాదం రాజకీయంగా మరింత మంటలు రేపుతోంది. టీడీపీతో కలిసి పరిపాలనలో భాగస్వామ్యంగా ఉన్న జనసేన పార్టీ నేత బోనబోయిన శ్రీనివాస యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కూటమి ప్రభుత్వ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారాయి. పోలీసు వ్యవస్థ పనితీరులో ఉన్న లోపాల వల్లే కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా అంబటి రాంబాబు వ్యవహారంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించిందని ఆయన ఆరోపించారు.

నల్లపాడు సిఐ నిర్లక్ష్యం వల్లే చిల్లీస్ సెంటర్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని శ్రీనివాస యాదవ్ విమర్శించారు. గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి అంబటిని వేరే మార్గంలో తరలించాల్సిన బాధ్యత పోలీసులదే అయినా, ఆ దిశగా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అలాగే అంబటి నివాసం వద్ద పెద్ద సంఖ్యలో జనసందోహం ఉన్నప్పటికీ పట్టాబిపురం సిఐ స్పందించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీరు చేసిన తప్పులకు మేం శిక్షలు అనుభవించాల్సి వస్తోంది అంటూ పోలీసు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జనసేన నేత, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోర్టుల చుట్టూ తిరిగామని, ఇప్పుడు అధికారంలో ఉన్నా కేసులు పెట్టించుకునే పరిస్థితి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పోలీసుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు కూడా వెల్లడించారు.

అంబటి రాంబాబు వివాదం కారణంగా కల్తీ నెయ్యి కేసులో అసలు దోషులు దృష్టి తప్పించుకున్నారన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న జనసేన వైఖరిలో అసంతృప్తి పెరుగుతోందా? లేక పోలీసు వ్యవస్థలో సమన్వయం లోపిస్తున్నదా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అధికార పక్షంలోని భాగస్వామ్య పార్టీ నేతలే ఇలాంటి విమర్శలు చేయడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఈ అంశం రాబోయే రోజుల్లో మరింత ప్రాధాన్యం సంతరించుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

Leave a Reply