Gudivada | స్కూల్ ఎక్స్ లెన్స్ అవార్డులు..

Gudivada | స్కూల్ ఎక్స్ లెన్స్ అవార్డులు..
Gudivada, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లో హైటెక్స్ ప్రాంగణంలో జరిగిన విద్యా సంబంధిత కార్యక్రమంలో బ్రెయిన్ ఫీడ్ ఈటీ టెక్ వారు జాతీయ స్థాయిలో ప్రకటించిన స్కూల్ ఎక్స్లెన్స్ అవార్డు ( ఎక్స్ లెన్స్ అవార్డ్స్)లను గుడివాడకు చెందిన నాలుగు ప్రముఖ విద్యాసంస్థలు దక్కించుకున్నాయి. విద్యా ప్రమాణాలు, నవీన బోధన పద్ధతులు, విద్యార్థుల సమగ్రాభివృద్ధి, సాంకేతికత ఆధారిత బోధన విధానాలు, నిర్వహణా నైపుణ్యాల పరంగా ఈ పాఠశాలలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈ ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్నాయి.
విద్యావికాస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, విద్యాలయ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, శుభోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అవార్డులు పొందాయి. ఈ విద్యాసంస్థలు జాతీయ స్థాయిలో అవార్డులను అందుకోవడం ద్వారా గుడివాడ పట్టణం మరోసారి రాష్ట్రస్థాయి విద్యా రంగంలో తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో, నిబద్ధతతో పని చేస్తున్న ఈ పాఠశాలల యాజమాన్యాల నిబద్దతను అధ్యాపకుల కృషిని, తల్లిదండ్రుల విశ్వాసాన్ని బ్రెయిన్‌ఫీడ్ సంస్థ ప్రశంసించింది.
ఈ పురస్కారాలను స్వీకరించిన పాఠశాల యాజమాన్యాలు మాట్లాడుతూ.. “ఈ అవార్డు మా విద్యా ప్రయాణంలో మరొక మైలురాయి. నూతన సాంకేతికత, విలువలతో కూడిన బోధన, శ్రేష్ఠమైన విద్యా వాతావరణం ఏర్పాటుకు మా కృషిని మరింతగా విస్తరిస్తాం” అని తెలిపారు. గుడివాడ నుండి నాలుగు పాఠశాలలు ఒకేసారి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక పురస్కారాలను పొందిన సందర్భంగా పుర ప్రముఖులు, విద్యార్ధుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది తమ అభినందనలు తెలియజేసారు.
