అహ్మదాబాద్ : పంజాబ్ కింగ్స్ జట్టు మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఈ రోజు రాత్రి 7.30 గంటలకు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనుంది. రెండు జట్లు తమ తొలి మ్యాచ్ ఆడనున్న తరుణంలో అందరి దృష్టి జట్ల ప్లేయింగ్-11పైనే ఉంటుంది.
శ్రేయస్ అయ్యర్ ను ఈ సారి కోల్‌కతా ఫ్రాంచైజీ నిలుపుకోలేదు. శ్రేయస్ అయ్యర్ ను వేలంలో పొందాలని ప్రయత్నించారు కానీ పంజాబ్ కింగ్స్ శ్రేయస్ కోసం పోరాడి రూ. 26.75 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. భారత జట్టు వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ కెప్టెన్సీ వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. గిల్ వరుసగా రెండో సీజన్ టైటాన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఈ సారి గుజరాత్ జట్టు చాలా మారిపోయింది. అందువల్ల ప్లేయింగ్-11ను ఎంచుకోవడం అంత సులభం కాదు.
ఇక పంజాబ్ జట్టు ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ను జట్టులో ఉంచుకుంది. అతను ఓపెనర్ పాత్రలో కనిపించవచ్చు. అతనితో పాటు జోష్ ఇంగ్లిస్ ఇన్నింగ్స్ ను ప్రారంభించే అవకాశం ఉంటంది. పంజాబ్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ ఇంగ్లిస్ ను చాలా ఇష్టపడతాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మూడో స్థానంలో రావచ్చు లేదు నేహాల్ వధేరాను కూడా పంపే అవకాశం ఉంటుంది. శ్రేయస్ అయ్యర్ భారత్ తరఫున నాలుగో స్థానంలో ఆడుతున్నాడు. కాబట్టి నాలుగో స్థానంలో వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. మార్కస్ స్టొయినీస్ పంజాబ్ కు తిరిగి వచ్చాడు. అతను ఆల్ రౌండర్ గా జట్టులో ఆడటం ఖాయం. గ్లెన్ మ్యాక్స్ వెల్ కూడా పంజాబ్ జట్టులోకి తిరిగి వచ్చాడు. శశాంక్ సింగ్ కూడా ఆడుతున్నాడు. అతన్ని ఫ్రాంచైజీ నిలుపుకుంది. బౌలింగ్ విషయానికొస్తే.. ఈ జట్టులో ఇద్దరు అత్యుత్తుమ ఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఇందులో ఒకరు భారత పేసర్ అర్ష్ దీప్ సింగ్.. మరొకర్ దక్షిణాఫ్రికాకు చెందిన మార్కో జాన్సెన్. ఐపీఎల్ లో తన స్పిన్ తో సంచలనం సృష్టించిన లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ స్థానం కూడా ఖాయం అయింది. హర్‌ప్రీత్ బ్రార్ ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా జట్టులో ఉంటాడు.
ఈ సీజన్ లో గుజరాత్ జట్టు చాలా మారిపోయింది. అద్భుతమైన బ్యాటర్ జోస్ బట్లర్ గుజరాత్ జట్టులోకి వచ్చాడు. రాజస్థాన్ తరఫున ఆడిన సమయంలో బట్లర్ విస్ఫోటక బ్యాటింగ్ ను మనం మరిచిపోలేం. జోస్ బట్లర్ కెప్టెన్ గిల్ తో కలిసి ఓపెనింగ్‌కు రావడం దాదాపు ఖాయం. మూడో స్థానంలో సాయి సుదర్శన్ ఉన్నాడు. ఈ సీజన్ లో గుజరాత్ తరఫున గ్లెన్ ఫిలిప్స్ నాలుగో స్థానంలో కనిపించవచ్చు. రాహుల్ తెవాటియా ఐదో స్థానంలో వచ్చే అవకాశం ఉంది. అయితే వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్ స్పిన్ విభాగానికి బాధ్యత వహిస్తారు. సాయి కిషోర్ కూడా వారికి మద్ధతు అందిస్తాడు. ఫాస్ట్ బౌలింగ్ బాధ్యత కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ త్రయంపై ఉంటుంది. అయితే ఈ రెండు జట్లు బలంగా ఉన్న నేపథ్యం మ్యాచ్ రసవత్తరంగా మారనున్నట్లు తెలుస్తోంది.
పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), మార్కస్ స్టొయినీస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ , శశాంక్ సింగ్, నేహాల్ వధేరా, మార్కో జాన్సెన్, హర్‌ప్రీత్ బార్, అర్ష్ దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
గుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, మహ్మద్ సిరాజ్, సాయి కిషోర్, కగిసో రబాడ, ప్రసిద్ధ్ కృష్ణ