12 శాతానికి గుడ్ బై.. ఇకపై 5, 18% శ్లాబుల్లో పన్ను
దీపావళి నుంచి అమల్లోకి..
స్వాత్రంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ
సామాన్యులపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) (GST) భారం తగ్గుతుందని, తదుపరి తరం సంస్కరణలు అమలు చేయనున్నట్టు స్వాత్రంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోడీ (Prime Minister Modi) ప్రకటించారు. సాధారణ పౌరులు, రైతులు, మధ్యతరగతి, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలు) కు ఉపశమనం కల్పించే లక్ష్యంతో జీఎస్టీ సంస్కరణల (GST reforms) తదుపరి దశ అవసరమని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా ప్రస్తుతం నిత్యాసవరాలపై ఉన్నజీఎస్టీ రేట్లను తగ్గిస్తామని, ఇప్పుడున్న 4 శ్లాబుల స్థానంలో రెండు మాత్రమే ఉండేలా చూస్తామని స్పష్టం చేశారు. దీనివల్ల ఈ ఏడాది దీపావళి నాటికి ప్రజలు పండుగ సంతోషాలు రెట్టింపు అవుతాయని మోడీ వెల్లడించారు.
జీఎస్టీ విధానంలో కూడా తాము కొత్త సంస్కరణలు తెస్తున్నామని ప్రధాని మోడీ వెల్లడించారు. సామాన్య ప్రజలపై ట్యాక్స్ భారం తగ్గిం చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీపావళి పండుగ లోపు జీఎస్టీలో కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు. అలాగే దేశాన్ని సోలార్, గ్రీన్ హైడ్రోజన్ శక్తి దిశగా నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. అణుఇంధనంలో కూడా వేగంగా ఎదుగుతున్నామన్నారు. ఈ క్రమంలోనే అణు విద్యుత్ ఉత్పత్తిరంగంలో ప్రయివేటు పెట్టుబడలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. డీజిల్, పెట్రోల్ దిగుమతుల కోసం దేశం లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని, కొత్త ఇంధనాలను ఉత్పత్తి చేయడం ద్వారా ఈ దిగుమతులను తగ్గించడమే తమ లక్ష్యమని తెలియజేశారు.
ప్రధాని మోడీ వెలువడిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జీఎస్టీకి సంబంధించి కీలక ప్రకటన చేసింది. జీఎస్టీలో ఇకమీదట రెండు శ్లాబులు ఉంటాయని, కొన్ని రకాల ఉత్పత్తులకు మాత్రమే ప్రత్యేక రేట్లు ఉంటాయని పేర్కొంది. కొత్త జీఎస్టీ నిర్మాణం ప్రస్తుత 5, 12, 18, 28 శ్లాబ్ ను భర్తీ చేస్తుంది. వచ్చే నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై మరింత స్పష్టత వెలువడనుంది.
99 శాతం వస్తువులు 5 శాతం పరిధిలోకి..
కేంద్ర ప్రభుత్వం చేయనున్న జీఎస్టీ సంస్కరణల్లో 5 శాతం, 18 శాతం పన్ను రేట్లను మాత్రమే ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సున్నా జీఎస్టీ పన్ను నిత్యావసర ఆహార పదార్థాలపై, 5 శాతం రోజువారీ వినియోగ వస్తువులపై, 12 శాతం ప్రామాణిక వస్తువులపై, 18 శాతం ఎలక్ట్రానిక్స్, సేవలపై, 28 శాతం లగ్జరీ, ఆల్కాహాల్, ధూమపానం వంటి సిన్ గూడ్స్ పై వసూలు చేస్తున్నారు. కొత్తగా ప్రతిపాదించిన జీఎస్టీ విధానంలో రెండు శ్లాబ్లు, లగ్జరీ, సిన్ గూడ్స్ పై 40 శాతం ప్రత్యేకరేటు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే, ప్రస్తుతం 12 శాతం శ్లాబ్లోని 99 శాతం వస్తువులు 5 శాతం బ్రాకెట్ కు, 28 శాతం వద్ద వసూలు చేస్తున్న దాదాపు 90 శాతం వస్తువులు, సేవలు 18 శాతం పన్ను రేటుకు మారుతాయి. 40శాతం ప్రత్యేక జీఎస్టీ శ్లాబ్ ఏడు రకాల వస్తువులపై మాత్రమే విధించే అవకాశాలు ఉన్నాయి. అందులో పొగాకు కూడా ఉంటుందని తెలుస్తోంది.