- 12శాతం స్లాబ్ రద్దు చేసే అవకాశం..
- అందరూ వినియోగించే వస్తువులపై కేవలం 5 శాతం జిఎస్టీ
- తక్కువ ధరలకు రానున్న కీలక వస్తువులు..
- ఈ నిర్ణయంతో ప్రభుత్వం వేల కోట్ల భారం..
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఆదాయ పన్నుల రాయితీల రూపంలో మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కల్పించిన కేంద్ర ప్రభుత్వం (Central Government) మరో చర్యకు సిద్ధమవుతోంది. మధ్యతరగతి, తక్కువ ఆదాయ కుటుంబాలను దృష్టిలో ఉంచుకుంది. వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) తగ్గించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 12 శాతం జీఎస్టీ స్లాబ్ (GST slab) ను పూర్తిగా తొలగించడం లేదా ప్రస్తుతం 12 శాతం పన్ను పరిధిలో అనేక వస్తువులను దిగువన 5 శాతంలోకి తిరిగి చేర్చడం వంటి వాటి గురించి కేంద్రం ఆలోచిస్తోంది.
ఈ తగ్గింపు వల్ల మధ్యతరగతి, ఆర్థికంగా బలహీన వర్గాలు ఉపయోగించే టూత్‌పేస్ట్, టూత్ పౌడర్, గొడుగులు, కుట్టు యంత్రాలు, ప్రెషర్ కుక్కర్లు, వంటగది పాత్రలు, ఎలక్ట్రిక్ ఐరన్‌లు, గీజర్‌లు, చిన్న సామర్థ్యం గల వాషింగ్ మెషీన్లు, సైకిళ్లు, రూ.1,000 కంటే ఎక్కువ ధర కలిగిన రెడీమేడ్ దుస్తులు, రూ.500 నుండి రూ.1,000 మధ్య ధర కలిగిన పాదరక్షలు, స్టేషనరీ వస్తువులు, టీకాలు, సిరామిక్ టైల్స్, వ్యవసాయ ఉపకరణాలు వంటి వాటి ధరలు తగ్గే అవకాశం ఉంది. మార్పులు అమలులోకి వస్తే ఈ వస్తువులు చాలా వరకు తక్కువ ధరలకు వస్తాయి. మరోవైపు, ప్రభుత్వం సరళీకృతమైన, సులభంగా పాటించే జీఎస్టీని కూడా పరిశీలిస్తోంది.
అయితే, ఈ చర్యల వల్ల ప్రభుత్వంపై రూ. 40,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్ల వరకు భారం పడనుంది. అయితే, వినియోగం పెరిగితే జీఎస్టీ వసూల్లు (GST collection) పెరుగుతాయని కేంద్రం నమ్ముతోంది. మరోవైపు, కేంద్రం ఈ చర్యలకు ఒప్పుకున్నా రాష్ట్రాలు ఏ విధంగా భావిస్తాయనేది చూడాలి. జీఎస్‌టీ కింద, రేటు మార్పులకు జీఎస్‌టీ కౌన్సిల్ నుండి ఆమోదం అవసరం. ఇప్పటి వరకు జీఎస్టీ కౌన్సిల్ (GST Council) చరిత్రలో ఒకసారి మాత్రమే ఓటింగ్ జరిగింది. ప్రతీ నిర్ణయం కూడా ఏకాభిప్రాయం ప్రకారమే తీసుకుంది. ఈ నెల చివర్లో జరిగే 56వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో ఈ తగ్గింపు ప్రతిపాదనను ప్రవేశపెట్టనుంది కేంద్రం. అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత స్లాబ్ ను మార్చనుంది.