శ్రీహరికోట: భారత్-అమెరికా సంయుక్తంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం నిసార్ (NISAR) విజయవంతంగా నిప్పులు కక్కుతూ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ సాయంత్రం 5.40 గంటలకు నిసార్ ఉపగ్రహాన్ని GSLV-F16 రాకెట్ ద్వారా ప్రయోగించారు. దీని ద్వారా భూమిపై సున్నిత మార్పులను గుర్తించే మిషన్‌కు నాంది పలికారు.
ఇదిలా ఉండగా, ఆకాశంలోకి దూసుకెళ్లే GSLV-F16 రాకెట్ ద్వారా నిసార్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడానికి కౌంట్‌డౌన్ మంగళవారం మధ్యాహ్నం 2.10 గంటలకు ప్రారంభమైంది.
ప్రతి 12 రోజులకు భూమి స్కాన్
2,392 కిలోల బరువుతో కూడిన నిసార్ ఉపగ్రహం, ప్రతి 12 రోజులకు ఒకసారి భూమి మొత్తాన్ని స్కాన్ చేస్తుంది. అడవులు, పంటపొలాలు, మంచు ప్రాంతాలు, భూకంపాలు, ప్రకృతి విపత్తులపై కీలక సమాచారం అందించగలదు.
టెక్ పరంగా మైలురాయి
NISR లో NASA అభివృద్ధి చేసిన L-బ్యాండ్ రాడార్ మరియు ISRO అభివృద్ధి చేసిన S-బ్యాండ్ రాడార్ వ్యవస్థలు ఉన్నాయి. ఈ రెండూ కలిసి భూమిలో అత్యంత సూక్ష్మమైన మార్పులను కూడా గుర్తించగలవు. వీటి సమన్వయంతో భూమిపై ఒక్క సెంటీమీటర్ మార్పునూ గుర్తించగలదు.
రెండు దశల మిషన్
నిసార్ ఉపగ్రహాన్ని 747 కిలోమీటర్ల ఎత్తులోని సన్-సింక్రనస్ ఆర్బిట్ (Sun-synchronous orbit)లో ప్రవేశపెట్టనున్నారు. ప్రయోగం అనంతరం 90 రోజుల్లో ఉపగ్రహ సేవలు పూర్తిగా ప్రారంభం అవుతాయి. ఇది పగలు, రాత్రి తేడా లేకుండా, ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా పనిచేస్తుంది. ప్రతి స్కాన్‌లో 240 కిలోమీటర్ల వెడల్పు భూమిని, 10 మీటర్ల స్పష్టతతో పరిశీలించగలదు.
విపత్తుల ముందస్తు హెచ్చరికల యంత్రం
నిసార్ సహాయంతో అగ్నిపర్వతాలు, కొండచరియలు, కార్చిచ్చు, తుపాన్లు, సునామీలు వంటి ప్రకృతి విపత్తులపై ముందస్తుగా హెచ్చరికలు అందించవచ్చు. అంతేకాదు, వంతెనలు, డ్యామ్‌లు, ఇతర నిర్మాణాల్లో లోపాలను గుర్తించగల సామర్థ్యం దీనికి ఉంది. ఇది రైతులకు పంటల పురోగతి, నేల తేమ, జలవనరుల పరిస్థితులపై కీలక సమాచారం అందించనుంది.
తక్కువ ఖర్చులో ప్రపంచ స్థాయి టెక్నాలజీ
కేవలం రూ.11,200 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన నిసార్ ప్రాజెక్టులో, భారత్ పాత్ర కీలకం. భారత విభాగానికి కేవలం రూ.800 కోట్లు మాత్రమే ఖర్చవడం గమనార్హం. ఇది భారత ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని, తక్కువ వ్యయంతో ప్రపంచ స్థాయి టెక్నాలజీని రూపొందించగల సామర్థ్యాన్ని చాటుతోంది.
నాసా కితాబులు
నాసా ఎర్త్ సైన్స్ డైరెక్టర్ కరెన్ సెయింట్ జర్మైన్ మాట్లాడుతూ – “భూమిపై ఒక సెంటీమీటర్ మార్పును కూడా గుర్తించే సాంకేతికత NISAR వద్ద ఉంది. ఇది US-భారతదేశం భాగస్వామ్యంలో ఇప్పటివరకు అభివృద్ధి చేయబడిన అత్యంత శక్తివంతమైన భూమి పరిశీలన ఉపగ్రహం” అన్నారు.