మహిళా సంఘ భవనానికి భూమి పూజ

ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో మహిళా సమాఖ్య సంఘ భవన నిర్మాణానికి సోమవారం భూమి పూజ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ నీరడి జ్యోతి రవికుమార్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులతో కలిసి నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, రూ.10 లక్షల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో గ్రామపంచాయతీ ఆవరణలో మహిళా సంఘ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సహకారంతో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
ఐకేపీ ఏపీఎం రాజేందర్ మాట్లాడుతూ, మండలంలోని 17 గ్రామపంచాయతీలలో 11 గ్రామాల్లో మహిళా సంఘ భవనాల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. మహిళలు సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ భవనం మహిళా సంఘ కార్యకలాపాలకు వేదికగా నిలుస్తుందని అన్నారు.
భవన నిర్మాణాన్ని నాణ్యతతో పూర్తి చేయాలని గుత్తేదారుని సర్పంచ్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి చైర్మన్ బజానోళ్ల పెద్ద గంగారాం, వార్డు సభ్యులు నీరడి రవికుమార్, సుధాకర్, దండెం సాయిలు, వాయు కుమార్, తాడేం మమత, సుంకరి రజిని, బెజ్జంకి వరలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకరి సుదర్శన్, గోవింద్ రెడ్డి, విజయ్ చందర్, కట్ట లక్ష్మణ్, చిన్న లస్మయ్య, కట్ట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
