- లక్షలాది మంది తాగే నీరు కలుషితం
- ఎన్టీటీపీఎస్ అధికారులపై జనం ఆగ్రహం
ఆంధ్రప్రభ, ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా) : ఎన్టీటీపీఎస్ అధికారులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. గతంలో అనేకసార్లు బూడిద నీటిని కూలింగ్ కెనాల్ ద్వారా తాగునీటిలో కలిపి ఘనత వహించిన ఎన్టీటీపీఎస్ అధికారులు ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా బుడమేరు డైవర్షన్ చానల్ (వేడినీళ్ల కాలువ) ద్వారా కృష్ణా నదిలోకి వదిలేశారు.
స్వార్థ ప్రయోజనాల కోసం ప్లాంట్ అధికారులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల నుంచి ప్లాంట్ లో బూడిద రవాణా నిలిచిపోవడంతో పెద్ద ఎత్తున ప్లాంట్ లో బూడిద పేరుకుపోయింది. దీంతో అధికారులు బూడిద నీటిని వేడినీళ్ల కాలువ ద్వారా కృష్ణా నదిలోకి వదిలేశారు.
లక్షల మంది ప్రజలు తాగే కృష్ణా నీటిలోకి బూడిద నీరు కలపడం స్థానికులకు ఆగ్రహం తెప్పిస్తుంది. విజ్ఞత లేకుండా, విచక్షణ మరిచి బూడిద నీరు కాలువ ద్వారా కృష్ణా నదిలో కలపడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. బూడిద నీటి ద్వారా తాగునీరు కలుషితమై ప్రజలకు వ్యాధులు ప్రబలితే ఎన్టీటీపీఎస్ యాజమాన్యం బాధ్యత వహిస్తుందా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
జిల్లా కలెక్టర్ లక్ష్మీశ స్పందించి ఇలాంటి దుర్మార్గపు, దుశ్చర్యలకు పాల్పడుతున్న ఎన్టీటీపీఎస్ యాజమాన్యంపై చట్టప్రకారం చర్యలు తీసుకొని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.