కృతజ్ఞత అంటే ఏమిటి? ”కృత”.. చేసిన మేలును ”జ్ఞ”.. జ్ఞాపకం చేసుకొని ఎదుటివారికి తమ సంతోషాన్ని తెలియచేయడం. పరిస్పరాధారిత సమాజంలో ప్రతినిత్యం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలియచేయడం వల్ల సమాజంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. కృతజ్ఞత అనేది.. చేసిన సహాయాన్ని గుర్తించడం, చేసిన వారికి ధన్యతలు తెలుపడం, త్రికరణశుద్ధిగా ఎదుటివారికి అవసరమైన సమయంలో సహాయపడడమనే మూడు మార్గాలగుండా వెలుగు చూస్తుంది. కృతజ్ఞతను తెలపడమంటే.. పొందిన సహాయాన్ని ఆంతరంగికంగా గుర్తించి.. బాహటంగా వెల్లడించడంగా చెప్పుకోవచ్చు. ”సిసిరో” అనే రోమన్ తత్త్వవేత్త కృతజ్ఞత తెలపడమనేది ”అన్ని ధర్మాలకన్నా ఉత్తమధర్మమే కాదు వాటన్నింటి మూలాధారమైనది” అంటాడు. కృతజ్ఞతను.. సామరస్య జీవన విధానానికి సానుకూలమైన పార్శ్వంగా సామాజిక శాస్త్రజ్ఞులు గుర్తిస్తారు. పశుపక్ష్యాదులను పూజించడం.. పంచభూతాలను అర్చించడం.. పూజాదికాలు నిర్వహించడం.. లాంటివన్నీ జీవిత గమనంలో సహాయకారులైన వారికి కృతజ్ఞతలను తెలిపే సాధనాలుగా చెప్పుకోవాలి.
కృతజ్ఞత తెలపడం.. సకారాత్మక భావోద్వేగ వ్యక్తీకరణగా చెప్పబడుతుంది. మనలో లేనిదానిని ఇతరుల నుండి పొందుతాము. అందువల్ల కృతజ్ఞతాభావన మనకున్న దానిపై కాక లేనిదానిపై దృష్టిని కేంద్రీకరించేందుకు సహకరిస్తున్నది. కృతజ్ఞత తెలపడం ద్వారా మనస్సు ప్రశాంతతమై సహాయాన్ని పొందిన వ్యక్తిలోనూ, పరిస్థితులు ఎలాఉన్నా తాను చేసిన చిన్న సహాయమైనా అర్హునికి అందినదనే భావనతో సహాయపడిన వ్యక్తిలోనూ.. సకారాత్మకశక్తి జాగృతమై ఇరువురూ ఉత్తేజితులౌతారు, ఆనందిస్తారు. కృతజ్ఞతలు తెలపడమనేది అన్ని రోగాలను నయం చేయగలిగిన మందుగోలీగా పెద్దలు చెపుతారు. కొబ్బరి చెట్టుకు కొద్దినీరు నందించినా, జీవితాంతమూ తీయని శుద్ధమైన కొబ్బరి నీరాన్ని అందిస్తుందది. ఎదుటివారి సహాయానికి గుర్తించడం ”కృతజ్ఞత”, అది ఉత్తమం. ఏ విధమైన స్పందనలు చూపకుండా నిర్లిప్తంగా ఉండిపోవడం ”అకృతజ్ఞత”. అది మధ్యమం. ఉపకారం చేసినవారికి అపకారం తలపెట్టడం ”కృతఘ్నత”. అది నీచమైనది.
జీవితంలో ఎన్నో సమస్యలు, ఒత్తిడులు, మానావమానాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని నిర్వహించుకునే విధానాన్ని తెలుసుకునేందుకే భగవంతుడు కష్టాలను కలిగిస్తాడు. భగవంతుని సహాయాన్ని అపేక్షిస్తూ మనస్పూర్తిగా సమస్యలను నివేదిస్తే.. అవకాశాల రూపంలో వాటికి పరిష్కారం లభిస్తుంది. దానికి భగవంతునికి కృతజ్ఞతలు తెలుపడం వల్ల కష్టాలను అంగీకరించే మానసిక స్థితి ఆవిష్కృతమౌతుంది. మన సహాయాన్ని ఆశించి వచ్చిన వ్యక్తులకు శక్తి కొలది సహాయపడడమూ భగవంతునికి కృతజ్ఞత తెలుపడంగానే భావించవచ్చు. నిర్దేశిత కర్తవ్యానికి అతీతంగా ప్రవర్తించడమూ మనలనమ్మి బాధ్యత నప్పగించిన వారిపట్ల కృతజ్ఞతగానే చెప్పుకోవచ్చు. #హనుమంతునికి సీతాన్వేషణ కర్తవ్యం నిర్దేశింపబడింది. హనుమ అంతవరకే చేయవచ్చు.. లేదా తనకా శక్తి సామర్ధ్యాలు లేవని నీరసంగా కూర్చొనవచ్చు. కాని అంచనాలను మించి ప్రతిభను ప్రదర్శించాడు. అందుకే రాముడు.. కృతజ్ఞతలు తెలుపడంలో భాగంగా హనుమను ఆలింగనం చేసుకుంటూ.. ”జీవితంలో నేనే విధంగానూ హనుమంతుని ఋణం తీర్చుకోలేనని” అంటాడు. ఆలింగనం వల్ల సకారాత్మక శక్తి ఒకరిలో నుండి మరియొకరిలోకి ప్రవహిస్తుంది. నిజానికది కృతజ్ఞత యొక్క శక్తిగా గుర్తించాలి. ఇతరులకు సహాయపడడం, ఇతరుల సహాయానికి ధన్యవాదాలు తెలపడం వల్ల ఇరువురిలోనూ అమితమైన ప్రేరణ కలుగుతుంది.
కృతజ్ఞతను అలవాటుగా మార్చుకోవడంలో.. సహాయపడిన వారికి కృతజ్ఞతలు వెంటనే తెలుపడం, ఉత్తరాలు వ్రాయడం, పడుకునే ముందు, ఉదయం లేవగానే భగవంతునికి కృతజ్ఞతలు తెలపడం వల్ల ఉన్నతమైన శక్తికి అనుసంధానమై వ్యక్తిలో జాత్యంతరీకరణ జరుగుతుంది.
- పాలకుర్తి రామమూర్తి