Gram Sabha | ఉపాధికి గ్యారెంటీ..
- ‘వీబీ- జీ రామ్ జీ’తో ఎంతో మేలు
- ఉపాధి హామీ కూలీలకు 125 రోజుల పనిదినాలు
- పథకం అమల్లో జవాబుదారీతనం, పారదర్శకత
- మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
Gram Sabha | మైలవరం, ఆంధ్రప్రభ : ‘వికసిత్ భారత్- గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్)’ (‘వీబీ- జీ రామ్ జీ’)తో ఉపాధికి మరింత గ్యారంటీ లభిస్తుందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. మైలవరం మండలంలోని వెల్వడం గ్రామంలో ‘వీబీ- జీ రామ్ జీ’ పథకంపై సోమవారం గ్రామసభను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ వికసిత్ భారత్-2047 మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా, ఆధునిక గ్రామీణ అవసరాలకు తగినట్లుగా పాత పథకంలో మార్పులు చేసి ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయటానికి సిద్ధంగా ఉన్న కూలీలకు ఈ చట్టం సంవత్సరంలో 125 రోజులు ఉపాధికి హామీ ఇస్తుందన్నారు. దీని ద్వారా వారి ఆదాయాన్ని 25 శాతం పెంచుతుందన్నారు. ఉపాధికి హామీ ఇవ్వటం ద్వారా కరువు కారణంగా ఏర్పడే ప్రజల వలసలను నివారిస్తుందన్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రధానంగా ప్రజలకు నీటి భద్రత, గ్రామీణ ప్రధాన మౌలిక వసతులు, జీవనోపాధి మౌలిక వసతులు, వాతావరణ పరిస్థితులను స్థిరీకరించే (వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్ప్రభావాలను నిరోధించటం) పనులు అనే నాలుగు అంశాలపై ఈ పథకం దృష్టి పెట్టిందన్నారు.

ఈ పథకం ద్వారా చెరువులు, కుంటల వంటి నీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. నీటి వనరుల పునరుద్ధరణ ద్వారా వ్యవసాయానికి నీటి వసతితోపాటు భూగర్భ జల మట్టం పెంచేందుకు వీలు కలుగుతుందన్నారు. పక్కా రోడ్లు, గ్రామాల అనుసంధానం, అత్యవసరమైన సేవల కల్పన ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమిస్తుందన్నారు. డిజిటల్ హాజరు, కూలీలకు నేరుగా వేతనాల చెల్లింపు, డాటా ఆధారిత ప్రణాళికల ద్వారా జవాబుదారీతనాన్ని పెంచుతుందన్నారు. పంటలు వేసే, కోసే కాలాల్లో రైతులకు కూలీల కొరత రాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు 60 రోజుల పాటు పనులను నిలిపివేసే అవకాశం ఈ పథకం కల్పిస్తుందన్నారు.

అవినీతి నిరోధానికి, మోసాలను గుర్తించేందుకు కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థతో పథకంపై పర్యవేక్షణకు కేంద్ర, రాష్ట్రాల సంయుక్త స్టీరింగ్ కమిటీ ఉంటుందన్నారు. ఈ పథకంపై గ్రామ పంచాయతీ పర్యవేక్షణ అధికారాలను విస్తృతం చేయటంతో పాటు జీపీఎస్, మొబైల్ ఆధారిత పర్యవేక్షణ ఉంటుందన్నారు. తద్వారా పథకం అమలులో పారదర్శకత ఉంటుందన్నారు. ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి అక్కల్ రామ్మోహనరావు (గాంధీ), తెలుగుదేశం పార్టీ నాయకులు కోమటి సుధాకరరావు, ఎన్డీఏ కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.

