ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి..

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి..
మాడుగులపల్లి, ఆంధ్రప్రభ : రబీ సీజన్‌లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు విక్రయించేందుకు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్‌డీఓ) ఎర్రబెల్లి శేఖర్ రెడ్డి రైతులకు సూచించారు.
సోమవారం మండల పరిధిలోని గరకుంటపాలెం, గుర్రప్పగూడెం గ్రామాల్లో ఇందిరా క్రాంతి పథకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అలాగే ఆగామోత్కూర్, చిరుమర్తి, పాములపాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహశీల్దార్ సరోజ పావని, ఏపీఎం మధుసూదన్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీఆర్‌డీఓ ఎర్రబెల్లి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. ధాన్యాన్ని తూర్పారబట్టి, తాలు, తరుగు, చెత్త లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువస్తే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. ఏ-గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు రూ.2,389, కామన్ వెరైటీకి రూ.2,369 మద్దతు ధర అందుతుందని వెల్లడించారు.
కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తూర్పారబట్టే యంత్రాలు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఈ రబీ సీజన్‌లో జిల్లాలో మొత్తం 401 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందని చెప్పారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు 124 రైస్ మిల్లులను అనుసంధానం చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ కొలిచే యంత్రాలు, తూర్పారబట్టే యంత్రాలు, టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు వంటి అవసరమైన సౌకర్యాలు సిద్ధంగా ఉంచినట్లు వివరించారు.
సెంటర్ ఇన్‌చార్జ్‌లకు ఇప్పటికే ధాన్యం కొనుగోలు విధానంపై శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని సీనియార్టీ, సీరియల్ నెంబర్ ప్రకారం కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గరకుంటపాలెం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ జొన్నలగడ్డ లక్ష్మారెడ్డి అడిగిన ప్రశ్నకు డీఆర్‌డీఓ సమాధానం ఇచ్చారు. రబీ సీజన్‌లో పండించిన సన్న రకం ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేస్తారా? కొనుగోలు చేసినట్లయితే క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సన్న రకం ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేసి ప్రతి క్వింటాకు రూ.500 బోనస్ అందజేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సరోజ పావని, ఏపీఎం మధుసూదన్, మండల సమాఖ్య అధ్యక్షురాలు కొండ సావిత్రమ్మ, సర్పంచ్‌లు పెద్ది కృపాకర్, పందిరి మారయ్య, అండం రేణుక-యాదయ్య, కూరెళ్ళ నాగమణి-వెంకటాచారి, కునుకుంట్ల అంజయ్య, ఉపసర్పంచ్ జొన్నలగడ్డ లక్ష్మారెడ్డి, సీసీలు సైదులు, సత్యనారాయణ, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్యామ్, గ్రామ పాలనాధికారులు సోమగాని సతీష్, ఇసాక్, రామారావు, గ్రామపంచాయతీ కార్యదర్శులు సంధ్య, నాగేందర్ రెడ్డి, స్వామి, అన్నపూర్ణాదేవి, గ్రామ సంఘం అధ్యక్షురాళ్లు శివలీల, పున్న అనిత, దుర్గం లక్ష్మి, వీఓఏలు రాపర్తి సోమయ్య, భూపతి రేణుక, శ్రీను, పతాని సైదులు, తుంగతుర్తి యాదమ్మ, మధు తదితరులు పాల్గొన్నారు.
