GRAIN | రోడ్లపైనే ధాన్యం ఆరబోత
రోడ్లపై ధాన్యం కుప్పలు..

GRAIN | మద్దూర్, ఆంధ్రప్రభ : రోడ్లపై రైతులు ధాన్యం కుప్పలు ఆరబోస్తుండటంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోడ్లపై వరి ధాన్యం కుప్పలు ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతున్నాయి. రైతులు ఇష్టానుసారం రోడ్డుపై ధాన్యం కుప్పలు రోజుల తరబడి ఆరబోస్తుండడంతో ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉందని వాహనాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తపల్లి మండల పరిధిలోని కొత్తపల్లి, నిడ్జింత, దుప్పటి గట్టు, తిమ్మారెడ్డిపల్లి (Thimmareddypally) పలు గ్రామాల శివారులోని రోడ్డులో అడుగడుగునా ధాన్యం ఆరబెడుతున్నారు. రోజంతా ఆరబోసిన ధాన్యం సాయంత్రం కాగానే ఎక్కడికక్కడే కుప్పలుగా చేసి మరుసటి రోజు ఉదయాన్నే మళ్లీ ఆరోబోస్తున్నారు. రాత్రంతా ధాన్యం కుప్పలు అక్కడే ఉంచడంతో చీకట్లో కుప్పలు కనిపించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా ?
ధాన్యం రోడ్లపై ఆరబోస్తుండడంతో నిత్యం వాహనదారులు (Motoristes) ప్రమాదాల బారిన పడుతున్నారు. గురువారం రాత్రి 8గంటల సమయంలో లింగల్ చేడ్ గ్రామానికి చెందిన కృష్ణ అనే యువకుడు మద్దూర్ నుంచి సొంత గ్రామం లింగల్ చేడ్ కు వచ్చే సమయంలో నిడ్జింత గ్రామ శివారులో రోడ్డుపై ఉన్న వరి ధాన్యం కుప్పపై నల్లటి తార్పాలిన్ కనిపించక ఒక్కసారిగా బైక్ కుప్పపైకి ఎక్కడంతో కిందపడిన యువకుడికి హైల్మెట్ ఉండటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈ సమస్యను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.



