చీపురు పట్టి.. చెత్త తీసి..
- నంద్యాల ఎస్సీ హాస్టల్ గదుల్లో శ్రమదానం
(నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో) : నేను సైతం.. ఏక్ దిన్ .. ఏక్ గంట.. ఏక్ సాత్ అంటూ.. నంద్యాల పట్టణంలోని ఎస్సీ హాస్టల్ లో నంద్యాల కలెక్టరమ్మ (Nandyal Collector) చీపురు పట్టారు. గదులు ఊడ్చారు. చెత్తను తొలగించారు. సిబ్బందికి స్ఫూర్తిని ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవరచుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. గురువారం నంద్యాల పట్టణం దేవనగర్ లోని ఎస్ సి సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహం-1లో “ఏక్ దిన్…ఏక్ గంట…ఏక్ సాత్” స్వచ్ఛత కార్యక్రమంలో శ్రమదానం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం – 2025లో భాగంగా జిల్లా వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సాంఘీక సంక్షేమ శాఖ (Social Welfare Department) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వసతి గృహ ప్రాంగణాన్ని శుభ్రపరచి విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించామన్నారు. జిల్లాలో సోషల్ వెల్ఫేర్, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, మైనారిటీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ కలిపి మొత్తం 108 ఉన్నాయని, వీటన్నిటిలో కూడా ఇలాంటి శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థుల ఆరోగ్య రక్షణ సాధ్యమవుతుందని కలెక్టర్ అన్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (Municipal Administration), పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా శానిటేషన్ ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయటమే లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రతి కుటుంబం ఒక గంట సమయం కేటాయించి పరిసరాలను పరిశుభ్రం ( surroundings Clean) గా ఉంచితే అనారోగ్య సమస్యలు రావని వివరించారు. కొంతమంది తమ ఇళ్లను శుభ్రంగా ఉంచుకుని చెత్తను రోడ్లపై వేస్తున్నారని, అది మంచిపద్ధతి కాదని, అందరూ చెత్తను ఖచ్చితంగా డస్ట్ బిన్లలో వేసే అలవాటు చేసుకోవాలని సూచించారు. చెత్తను శాస్త్రీయ పద్ధతిలో వాడుక ఎరువులుగా మార్చి రైతులకు అందజేస్తామని, కాబట్టి ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు. అనంతరం వసతి గృహంలోని గదులను శుభ్రం చేశారు. వంట పాత్రలు, రేషన్ సరుకులు, టాయిలెట్లను పరిశీలించారు. ముమ్మర పారిశుద్ధ కార్యక్రమాల్లో పాల్గొని తమ సిబ్బందితో పరిశుభ్రం చేయించారు. సాంఘిక సంక్షేమ శాఖ డిడి చింతామణి, వసతి గృహ వార్డెన్లు, మున్సిపల్ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

