స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త ఇవ్వాలి!!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త ఇవ్వాలి!!

నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : వెనుకబడ్డ వర్గాల రిజర్వేషన్ల(Reservations)ను 42 శాతానికి పెంచే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అయితే దాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా అమలు చేయాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya) సూచించారు.

ఈ రోజు నారాయణపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలనే సంకల్పం మంచి నిర్ణయం. అయితే దీని సాధ్యాసాధ్యాలను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడకూడదని, సామాజిక న్యాయం(Social Justice) అమలవ్వడం ప్రతి ప్రభుత్వానికి ప్రధాన కర్తవ్యం” అన్నారు.

“వెనుకబడ్డ వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడం పరిపాలనలో వారి భాగస్వామ్యాన్ని పెంపొందిస్తుందన్నారు. ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉంది, దానిపై వ్యాఖ్యానించడం ఇష్టంలేదన్నారు. అయితే ఈ నిర్ణయం అమలుకు పార్లమెంటు చట్టం అవసరం. కోర్టులను విమర్శించడం సరైన పద్ధతి కాదన్నారు. గత తీర్పుల ప్రకారం కోర్టు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాయని ” స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాల రిజర్వేషన్‌పై జాతీయ స్థాయి(National Level)లో ఏకాభిప్రాయం రావాల్సిన అవసరం ఉందని, అందుకోసం అన్ని రాజకీయ పార్టీలు కలసి పార్లమెంటులో బిల్లు రూపంలో తీర్మానం చేయాలని పిలుపునిచ్చారు.

“అత్యంత వెనుకబడిన కులాలను కూడా పరిగణనలోకి తీసుకొని సమగ్ర విధానం రూపొందించాలని, అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలి” అని సూచించారు. “అసెంబ్లీలో కూడా బీసీ రిజర్వేషన్లపై లోతైన చర్చ జరగాలని, అత్యదికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం(Welfare)పై సుస్థిర అభిప్రాయం ఏర్పడాలని ” దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు నామాజీ, జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, నాయకుడు కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply