అంగన్వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం

అంగన్వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం

పటమట, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, సూపర్వైజర్లు ఎదుర్కొన్న ప్రతి సమస్యలోనూ వారికి ఎప్పుడూ అండగా నిలిచింది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే జరిగిందని, ఇకపై కూడా అంగన్వాడీలకు అండగా కూటమి ప్రభుత్వమే ఉందని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ స్పష్టం చేశారు. అంగన్వాడీల వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు, ప్రతి నెల ఒకటో తేదీన జీతాల చెల్లింపు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నది గత చంద్రబాబు ప్రభుత్వమేనని ఆమె తెలిపారు.

చరిత్రలోనే అంగన్వాడి వర్కర్లకు, హెల్పర్లకు రెండు సార్లు వేతనాలు పెంచి, వారి గౌరవాన్ని కాపాడిన నాయకుడు చంద్రబాబునాయుడే అని పేర్కొన్నారు. మినీ అంగన్వాడీలను పూర్తి స్థాయి కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం, వేలాది మందికి పదోన్నతులు కల్పించడం, 5జి స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేయడం, కేంద్రాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల—ఇవన్నీ అంగన్వాడీల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న నిజమైన చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. అంగన్వాడీల గౌరవం, భద్రత, భవిష్యత్తు కోసం ఎప్పుడూ అండగా నిలిచేది చంద్రబాబు నాయకత్వమేనని ఆమె పేర్కొన్నారు. అంగన్వాడీలకు అండగా ఉన్నది, ఉంటుంది కూడా చంద్రబాబు నాయకత్వమే నని అన్నారు.

కూటమి ప్రభుత్వం చక్కటి పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ 70 శాతం ఉన్న హాజరు శాతాన్ని 96 శాతానికి పెంచి సమాజంలో అంగన్వాడీల కేంద్రాల గౌరవాన్ని పెంచిందన్నారు. వేసవి కాలంలో 15 రోజుల సెలవు దినాలను 30 రోజులకు పెంచేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు చంద్రబాబు మాత్రమేనని గద్దె అనురాధ తెలిపారు.

Leave a Reply