హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నీట మునిగిన పరిస్థితులు, రవాణా అంతరాయాలు, తాగునీటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక చర్యలు ప్రారంభించింది.
రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) కార్యాలయంలో ప్రత్యేక ఫ్లడ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ప్రజలు తక్షణ సమస్యలను తెలియజేయడానికి 040-3517 4352 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. రాకపోకల్లో అంతరాయాలు, తాగునీటి సరఫరా సమస్యలు వంటి అంశాలపై ప్రజలు ఈ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
అదేవిధంగా, ప్రతి సర్కిల్ స్థాయిలో సూపరిండెంటింగ్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల కార్యాలయాల్లోనూ ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. ఫీల్డ్ స్థాయిలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా స్థానిక అధికారులు వెంటనే స్పందించేలా చర్యలు చేపట్టారు.
ఈ కంట్రోల్ రూంల ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై సమాచార సేకరణ, స్పందన, పునరుద్ధరణ కార్యక్రమాలపై సమన్వయం జరుగుతుంది. రహదారులు దెబ్బతిన్నా, కల్వర్లు కూలినా, గండ్లు పడ్డా వెంటనే సంబంధిత కంట్రోల్ రూమ్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు.