Gold Smuggling Case | రన్యారావుకు బెయిల్‌

బెంగళూరు : గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో కన్నడ నటి రన్యారావుతో పాటు తరుణ్ రాజ్‌ కొండూరుకు బెంగళూరు కోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఇద్దరికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.2లక్షల చొప్పున వ్యక్తిగత బాండ్‌, ఇద్దరి పూచీకత్తుతో బెయిల్‌ని ఇచ్చింది. అధికారులు పిలిచిన సమయంలో తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించొద్దని.. దర్యాప్తు అధికారులకు సహకరించాలని, కోర్టు నుంచి ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని.. భవిష్యత్‌లో ఇదే తరహాలో నేరాల్లో పాల్గొనొద్దని ఆదేశించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే బెయిల్‌ రద్దవుతుందని హెచ్చరించింది. డైరెక్టరేట్‌ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ 60రోజుల్లోగా చార్జిషీట్‌ని దాఖలు చేయలేకపోయారు. ఈ క్రమంలో రన్యారావు, తరుణ్‌ రాజ్‌ ఇద్దరు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో బెయిల్‌ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.

కన్నడ నటి అయిన రన్యారావును మార్చి 3న బంగారం స్మగ్లింగ్‌ కేసులో డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు. విమానాశ్రయంలో ఆమెను అదుపులోకి తీసుకొని.. రూ.12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 14.2 కిలోల విదేశీ బంగారు కడ్డీలను తీసుకెళ్తున్నట్లు ఆమె గుర్తించింది. ఇదే కేసులో తరుణ్‌ రాజ్‌, సాహిల్‌ సకారియా జైన్‌లను అరెస్టు చేశారు. ప్రస్తుతం ముగ్గురు బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర జైలులో ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఏప్రిల్‌ 22న కేంద్రం ముగ్గురిపై కొఫిపోసా చట్టాన్ని ప్రయోగించింది. బెయిల్ లేకుండా దాదాపు సంవత్సరం పాటు నిందితులను నిర్బంధించడానికి చట్టం వీలు కల్పిస్తుంది. ఇటీవల రాన్యా తల్లి చట్టం కింద ఆమెను నిర్బంధించడాన్ని సవాల్‌ చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. అభ్యంతరాలు దాఖలు చేయాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణ విచారణ జూన్ 3వ తేదీకి వాయిదాపడింది.

Leave a Reply