ముంబై: ధనత్రయోదశి, దీపావళి పండుగల ముందు బంగారం ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా కొత్త రికార్డులకు చేరుకున్నాయి. ధనత్రయోదశి నాడు బంగారం కొనడం సంప్రదాయంగా భావించే భారతీయుల సెంటిమెంట్‌తో పాటు, పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ కూడా పసిడి ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది.
ప్రస్తుత ధరలు (శుక్రవారం, హైదరాబాద్‌లో)…
- 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ. 1,35,250
- 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ. 1,21,725
- కిలో వెండి : రూ. 1,81,000
అంతర్జాతీయ మార్కెట్‌లోనూ అదే జోరు..
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్సు ధర 4,300 డాలర్లను దాటి ఆల్‌టైమ్ రికార్డును నెలకొల్పింది. ఐదేళ్లలో ఇదే అత్యధిక ధర. వెండి ధర కూడా ఔన్సుకు 54 డాలర్లను దాటింది.
ఎంసీఎక్స్ (MCX) ట్రేడింగ్‌లో..
భారతదేశంలోని మల్టి కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1.31 లక్షలు దాటగా, వెండి ధర ఏకంగా రూ. 2 లక్షలు దాటింది.
ధరల పెరుగుదలకు కారణాలు..
అమెరికాలో షట్‌డౌన్ పరిస్థితులు, యూఎస్-చైనా వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి వంటి అంశాలు బంగారం, వెండి ధరలు పెరగడానికి ప్రధాన కారణాలుగా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ అనిశ్చితి సమయంలో పసిడిని సురక్షిత పెట్టుబడిగా భావించడంతో గోల్డ్ ఈటీఎఫ్‌లకు డిమాండ్ అమాంతం పెరిగింది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం, 2026 నాటికి బంగారం ధర రూ. 1.5 లక్షల మార్కును చేరుకునే అవకాశం ఉంది.

