వాగులు వంకలు దూకుడు
శబరి వంతెన వద్ద 33.5 అడుగులకు చేరుకున్న వరద
జాతీయ రహదారి పై వరద పరవళ్లు
ఏజెన్సీలో రాకపోకలు స్థంభన
జలదిగ్బంధనంలో మన్యం
ముంపు వాసులు అష్టకష్టాలు
అధికారులు అప్రమత్తం

ఆంధ్రప్రభ, చింతూరు,(ఎఎస్ఆర్ జిల్లా) : బంగాళఖాతంలో అల్పపీడన ప్రభావంతో చింతూరు ఏజెన్సీకి ఎగువ రాష్ట్రాలు తెలంగాణ (Telangana), ఛత్తీస్‌గడ్‌(Chhattisgarh)లలో కురుస్తున్న భారీ వర్షాలతో అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitarama Raju district) చింతూరు ఏజెన్సీలో గోదావరి, శబరి నదులకు వరద పోటెత్తింది. భద్రాచలం వద్ద గోదావరి నది 46.40 అడుగుల గరిష్ట నీటి మట్టానికి చేరుకుంది. కూనవరం, గోదావరి శబరి సంగమం (Godavari Sabari Sangam) వద్ద ప్రమాద హెచ్చరిక దాటి అంతకంతకు పెరుగుతోంది. గోదావరికి వరద పోటెత్తడంతో ఎదురు పోటు గురైన శబరి నది వరద ఉధృతి పెరిగింది. దీంతో చింతూరు వద్ద శబరినది శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి 33.5 అడుగులకు చేరుకుంది. శబరి పరివాహక, వాగుల పరివాహక ప్రాంతాల్లోని పంటపొలాలు నీట మునిగాయి. మిర్చి వేసిన పంటపొలాలోకి వరద నీరు చేరుతుండటంతో రైతన్నలు మిర్చి తోటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

జలదిగ్బంధనంలో మన్యం
గోదావరి శబరి నదుల వరద ఉదృతితో చింతూరు ఐటీడీఏ (Chintur ITDA) పరిధిలోనీ నాలుగు మండలాల్లోని రహదారులు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. చింతూరు మండలంలోని సోకిలేరు, కుయుగూరు, అత్తకోడల్లు, చంద్రవంక వాగులు వీఆర్ పురం మండలంలో అన్నవరం వాగు, కన్నాయిగూడెం, కూనవరం మండలంలోని పండ్రాజు పల్లి , కొండ్రాజు పేట , ఎటపాక లోని వీరాయుగూడెం వద్ద రహదారుల పై వరదనీరు చేరి ప్రవహిస్తోంది.

అంత్రరాష్ట్రాలకు దారి బంద్
ఆంధ్రా – ఒడిశా రాష్ట్రాలను కలుపుతూ ఉన్నటువంటి జాతీయ రహదారి 326పై నిమ్మలగూడెం – కుయుగూరు గ్రామాల మధ్య వరద నీరు చేరడంతో రెండు రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Leave a Reply