ADB | గొండ్వానా దేవస్థానాల అభివృద్ధికి జీవో జారీ చేయాలి..

  • ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌కు వినతిపత్రం అందజేసిన నాయకులు

ఉట్నూర్, ఆంధ్రప్రభ: ఉట్నూర్ గోండు రాజుల కోటతో పాటు ప్రాచీన కాలం నుంచి ఉన్న గొండ్వానా దేవస్థానాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ, గోండు వనసంఘాల నాయకులు గురువారం రాత్రి ఖానాపూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్కు వినతిపత్రం అందజేశారు.

నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రాచీన కాలం నుండి గొండ్వానా దేవస్థానాలు గొండ్వానా రాజ్యాల్లో ఘనంగా వర్ధిల్లాయని, కానీ స్వాతంత్ర్యం తర్వాత వాటి అభివృద్ధి నిలిచిపోయిందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో గొండ్వానా దేవతల అభివృద్ధి కోసం కటోడలు, పూజారులు, ధూపదీప నైవేద్యం కోసం ప్రత్యేక జీవో జారీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా గొండ్వానా దేవస్థానాల అభివృద్ధి కోసం ఇదే తరహా జీవో జారీ చేయాలని కోరారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ, గొండ్వానా దేవస్థానాల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గొండ్వాన గోండు మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు సిడం అర్జు, రాజ్ గోండు సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగం విష్ణురావు, కుమ్రం భీమ్ జిల్లా రాయి సెంటర్ సభ్యుడు మేడి కుర్సెంగ్ మొతిరాం, రాజ్ గోండు సేవా సమితి జిల్లా సంయుక్త కార్యదర్శి అనార్కలి, గిన్నెదరి సార్ మేడి ఆడతాను, ఉట్నూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మడావి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply