పేదలకు ఇళ్ళ స్థలాలు పంపిణీ చేయాలి…

పేదలకు ఇళ్ళ స్థలాలు పంపిణీ చేయాలి…
కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలు అమలు చేయాలి…
సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్ బాబు..
చల్లపల్లి – ఆంధ్రప్రభ : పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్ బాబు డిమాండ్ చేశారు. భారత కమ్యూనిష్టు పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పేదలకు ఇస్తానన్న వాగ్దానాలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. పట్టణాలలో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో పేదలకు మూడు సెంట్లు ఇంటి స్థలాలను వెంటనే మంజూరు చేయాలని కోరారు.
ఇంటి నిర్మాణానికి రూ 5 లక్షల ఆర్థిక సహాయం చేయాలని, అద్దె ఇంట్లో ఉంటున్న పేదలకు ఇంటీ అద్దె చెల్లించాలన్నారు. భూమిలేని నిరుపేదలకు సాగు భూమి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు స్వాధీనం చేయాలన్నారు. జీవో నెంబర్ 23న సడలించాలని, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో దళితవాడలో స్మశాన వాటికలో ఏర్పాటు చేయాలని కోరారు.
కూటమి ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణం కోసం గంతో ప్రకటించిన 4 లక్షల ఆర్థిక సహాయం ఇంటి నిర్మాణానికి సరిపోవని, అందుకోసం గత మూడు బడ్జెట్లలో నిధులు కూడా కేటాయించలేదని విమర్శించారు. నిర్మాణ సామాగ్రి ధరలు, కూలీల వేతనాలు పెరిగిన నేపద్యంలో ఇళ్ళ నిర్మాణానికి కనీసం 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలన్నారు. భూ మాఫియాలను అరికట్టాలని కోరారు. అర్హులైన వారికి రేషన్ కార్డులు ఫెంక్షన్లు ఇవ్వాలని కోరారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్ ఐ కృష్ణ మోహన్ కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మల్లుపెద్ది రత్నకుమారి, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గుత్తికొండ రామారావు, పార్టీ నాయకులు మాలెంపాటి కోటేశ్వరరావు, పెనుమత్స రాజారత్నం, పెనుమత్స ప్రభాకరరావు, నక్క శ్రీనివాసరావు, కొల్లూరి శ్రీధర్, గోగినేని రత్తయ్య, మహిళా సమాఖ్య నాయకులు హనుమానుల రాణి కుమారి, కంచర్ల ప్రభు కుమారి తదితరులు పాల్గొన్నారు.
