- బీఆర్ఎస్ అభ్యర్థి మారిపెద్ది మీనా, గణేష్
భీమ్‌గల్ టౌన్/రూరల్, ఆంధ్రప్రభ : గ్రామ ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసుకునే అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు మారిపెద్ది మీనా, గణేష్ కోరారు. శనివారం భీమ్‌గల్ మండలంలోని పల్లికొండ గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు బొట్టు పెట్టి తమకు మద్దతుగా ఓటు వేయాలని అభ్యర్థించారు.
పల్లికొండ సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాల్లోకి సంపాదన కోసం రాలేదని, ప్రజలకు సేవ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఎన్నికల అధికారులు కేటాయించిన ఫుట్‌బాల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించడం, వీధి దీపాల ఏర్పాటు, సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. యువత చదువుకునేందుకు లైబ్రరీ ఏర్పాటు చేస్తామని, మహిళలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు.
బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులుగా గెలిపిస్తే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామానికి చెందిన మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

