Gantasala | నయన మనోహరం..

Gantasala | ఘంటసాల, ఆంధ్రప్రభ : ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం ఘంటసాల మండలం శ్రీకాకుళంలో పూజలందుకుంటున్న శ్రీ కాకుళేశ్వరస్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తెల్లవారుజాము నుంచే శ్రీకాకుళం విచ్చేసి సమీపంలోని కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీకాకుళేశ్వరస్వామివారి దేవాలయ ప్రాంగణంలో ఉన్న ధ్వజస్థంభం వద్ద విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలోని ఆస్థాన మండపం వద్ద వేదపండితులు ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించారు.
భక్తులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి ఉదయం 11.16 నిమిషాలకు శ్రీకాకులేశ్వరస్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు టెంకాయలను కొట్టి తమ మొక్కుబడులు సమర్పించుకున్నారు. ప్రత్యేకంగా అలంకరించిన గరుడ వాహనం పై స్వామి, అమ్మవార్లను ఆశీనులను గావించి గ్రామోత్సవాన్ని వైభవోపేతంగా వేలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించారు. టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఏర్పాట్లను ఆలయ డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామవర ప్రసాదరావు పర్యవేక్షించారు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసు వారు బందోబస్తు నిర్వహించారు.
