ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్ : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ పేరిట జారీచేసిన జీవో నెం.49 ఆదివాసీ హక్కులకు విఘాతం కలిగిస్తుందని, ఈ జీవో అమలు అయితే ఆదివాసీ గిరిజనుల మునుగడ ప్రశ్నార్థకంగా మారనుందని మాజీ ఎంపీ, ఆదివాసీ సంఘాల ఉద్యమ నేత సోయం బాపూరావు (Soyam Bapurao) అన్నారు. మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Jishnu Dev Varma) ను ఆదివాసీ సంఘాల నేతలు రాజు భవన్ లో కలిసి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.49ను రద్దు చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు.
కొమురం భీం జిల్లాలోని ఆసిఫాబాద్ (Asifabad), కాగజ్ నగర్ డివిజన్లను ఏకపక్షంగా టైగర్ కన్జర్వేషన్ లో కలపడం వల్ల అటవీ భూములను నమ్ముకొని బతికే గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లుతుందని సోయం బాపూరావు గవర్నర్ (Governor) దృష్టికి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు ముందుకు వస్తున్న క్రమంలో జీవో నెం.49 జారీ చేయడం తగదని సూచించారు. ఇప్పటికే ఈ జిల్లాలో ఆ జీవోను రద్దు చేయాలని ఆందోళనలు చేస్తున్నారని, ఏకపక్షంగా జారీ చేసిన జీవో వల్ల ఈ జిల్లాలోని 339 ప్రభావిత గ్రామాల్లో గిరిజన, గిరిజనేతరులు ఆందోళన చెందుతున్నారన్నారు.
టైగర్ కన్జర్వేషన్ జీవో వల్ల తలెత్తే పరిణామాల గురించి గవర్నర్ అడిగి తెలుసుకోవడమే గాక ప్రభుత్వానికి నివేదిస్తానని హామీ ఇచ్చినట్టు సోయం బాపూరావు తెలిపారు. గవర్నర్ ను కలిసిన వారిలో సోయం బాపూరావుతో పాటు జాతీయ అఖిల భారతీయ గోండ్వానా మహాసభ ఉపాధ్యక్షులు సిడం అర్జు మాస్టర్, జిల్లా మేడి కురిసేంగా మోతిరాం, రాజ్ గోండ్ రాష్ట్ర కార్యదర్శి పెందూర్ సుధాకర్, రాజ్ గోండ్ సేవ సమితి జిల్లా కార్యదర్శి మాడవి నర్సింగ్ రావు, తిర్యాణి మండల సర్ మేడి అడసాను, మాజీ ఎంపీటీసీ ఉప మేడి ఆత్రం లింగు, రాజ్ గోండ్ సేవ సమితి జిల్లా ప్రచార కార్యదర్శి ఆత్రం చందన్ షా, ఆసిఫాబాద్ డివిజన్ అధ్యక్షులు ఆత్రం రకు, మానవ హక్కుల సంగం జిల్లా అధ్యక్షులు ఆత్రం లింగారావ్ తదితరులున్నారు.