గోపాల‌రావుప‌ల్లెలో అంత్య‌క్రియ‌లు

గోపాల‌రావుప‌ల్లెలో అంత్య‌క్రియ‌లు

తంగ‌ళ్ల‌ప‌ల్లి, ఆంధ్ర‌ప్ర‌భ : ఛ‌త్తీస్‌గ‌ఢ్ ఎన్‌కౌంట‌ర్‌లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టు(Maoist) కేంద్ర క‌మిటీ స‌భ్యుడు క‌డారి స‌త్యానారాయ‌ణ రెడ్డి అలియాస్ కోసా (69) అంత్య‌క్రియ‌లు ఆయ‌న సొంతూరు అయిన రాజ‌న్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లెలో గురువారం నిర్వ‌హించారు. ఉదయం మృతదేహం స్వగ్రామమైన గోపాలరావుపల్లె(Gopalaraupalle)కు చేరగానే కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటితో మునిగిపోయారు. గ్రామమంతా ఎరుపు జెండాలు రెపరెపలాడుతూ, విప్లవ గీతాలు మారుమోగుతూ శోకసంద్రంగా మారింది.

వర్షాన్నిలెక్కచేయకుండా ప్రజా సంఘాల నేతలు ఎరుపు జెండాలు( flags) ఊపుతూ లాల్‌సలామ్(Lalsalam) నినాదాలతో అంతిమ యాత్ర‌లో పాల్గొన్నారు. అంత‌కుముందు మాజీ ఎమ్మెల్సీ దేవి ప్రసాద్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మండల అధ్యక్షుడు రాజన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కుమార్(Jalagam Praveen Kumar), మునిగల రాజు, బైరినేని రాము కోసా భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

భారీగా తరలివచ్చిన గ్రామస్తులు, విప్లవ సానుభూతిపరులు, ప్రజా సంఘాల నాయకులు కోసా అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఎరుపు జెండాలు, విప్లవ గీతాల(Revolutionary Songs) మధ్య సాగిన యాత్రలో వాతావరణం కన్నీటి పర్వంగా మారింది. చివరగా కోసా అన్న కడారి కరుణాకర్ రెడ్డి, ప్రజా సంఘాల నేతలు చితికి నిప్పు పెట్టి తుదివీడ్కోలు పలికారు.

ప్ర‌జ‌ల కోసం విప్ల‌వ మార్గం ఎన్నుకున్నకోసా(Kosa) 45 ఏళ్ల‌పాటు అడ‌వుల్లోనే ఉంటూ చివ‌ర‌కు రెండు రోజుల కింద జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో భ‌ద్ర‌తా ద‌ళాల తూట‌ల‌కు అమ‌రుడు అయ్యారు. ఆయ‌న 45 ఏళ్ల విప్ల‌వ జీవితం ముగిసింది. కుటుంబానికి దూరంగా గడిపిన దశాబ్దాల తర్వాత స్వగ్రామంలో చివరి మజిలీ జరగడం అందరినీ కన్నీటి ప‌ర్య‌వంత‌మ‌య్యారు.

ప్రజా సంఘాల నాయకులు పౌర హక్కుల సంఘం కార్యదర్శి నారాయణరావు, భారత్ బచావో జాతీయ కమిటీ చైర్మన్ గాదె ఇన్నయ్య(Gade Innayya), విప్లవ రచయిత సంగం కార్యదర్శి పాణి, అమరవీరుల బంధుమిత్రుల కమిటీ నాయకురాలు పద్మ(Padma), సాంబమూర్తి, భవానితో పాటు విప్లవ నాయకులు, కోసాకు నివాళులు అర్పించారు. ఆయన ప్రజల కోసం చేసిన త్యాగాన్నికొనియాడారు.

ఈ సందర్భంగా గాదే ఇన్నయ్యతో పాటు పౌర హక్కుల సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఇది ముమ్మాటికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం(Modi Govt) చేసిన హత్యాకాండ అని బూటకు ఎన్‌కౌంట‌ర్‌(Encounter)లో సత్యనారాయణ రెడ్డిని చిత్రహింసలు చేసి కాల్చి చంపారని ఆరోపించారు. ముమ్మాటికి ఇది ప్రభుత్వం చేసిన హత్య అన్నారు.

అంచలంచెలుగా ప్రజా పోరాటాలలో నాలుగు దశాబ్దాలు గా ప్రజా ఉద్యమాలలో పనిచేస్తూ మావోయిస్టు కేంద్ర పార్టీ స్థాయికి ఎదిగారని అన్నారు. ద్రోహుల సమాచారంతో కామ్రేడ్ కడారి సత్యనారాయణరెడ్డి(Comrade Kadari Satyanarayana Reddy) తోపాటు మరో కేంద్ర కమిటీ సభ్యులు రాజు ను ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ సరిహద్దుల్లో బూటకపు ఎన్కౌంటర్ లో కాల్చి చంపారని ఆరోపించారు.

విప్లవ అభిమను లు కడసారి క‌న్నీళ్ల‌ల‌తో జోహార్లు అర్పించారు. గ్రామస్తులు కడారి కి పూర్వం గ్రామంతో ఉన్న సంబంధాలను గుర్తుచేసుకుంటూ కంటతడి పెట్టారు.

Leave a Reply