బయోటెక్నాలజీ, ఫార్మా, మెడికల్ టెక్నాలజీ రంగాల్లో ఆవిష్కరణలకు అవసరమైన మద్దతు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరిగిన ఆసియా పసిఫిక్ బయోడిజైన్ ఇన్నొవేషన్ సమ్మిట్ 2025లో ఆయన పాల్గొని ఇన్నొవేషన్ ఆఫ్ భారత్ – ది బయోడిజైన్ బ్లూప్రింట్ను ఆవిష్కరించారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ, బయోడిజైన్ విధానం ద్వారా వైద్య ఉత్పత్తుల ఆవిష్కరణలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని చెప్పారు. తయారీ స్థాయి నుంచి ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి చెందడం శుభపరిణామమని అన్నారు.
ఆరోగ్య సంరక్షణలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి స్వదేశీ ఆవిష్కరణలు అవసరమని పేర్కొన్నారు. అలాంటి పరిశోధనలకు తెలంగాణ మద్దతు ఇస్తుందని, వైద్య డేటాను గోప్యతా ప్రమాణాలతో అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
ఆవిష్కరణల కోసం విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, కార్పొరేట్ భాగస్వాములతో అనుసంధానం చేస్తామని చెప్పారు. మన ప్రతిభను దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.
బయోడిజైన్ విధానం క్లినికల్ అవసరాలకు ఆచరణాత్మక పరిష్కారాలు అందిస్తుందని, ఈ రంగంలో ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న పరిశోధనలు అభినందనీయమని అన్నారు.
లైఫ్ సైన్సెస్ రంగంలో జాతీయస్థాయిలో తెలంగాణ ఉన్నత స్థానంలో ఉందని తెలిపారు. డయాగ్నస్టిక్ పరికరాలు, ఇమేజింగ్ టెక్నాలజీ, ఇంప్లాంట్ టెక్నాలజీ, సర్జికల్ పరికరాలు, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్‌లో తెలంగాణకు పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చినట్లు చెప్పారు.
2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంతో తెలంగాణ ముందుకు వెళ్తోందని తెలిపారు.
వైద్య మౌలిక సదుపాయాల కోసం సుల్తాన్‌పూర్‌లో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్క్‌ను ఏర్పాటు చేశామని, అక్కడ 60కి పైగా ప్రపంచ, దేశీయ కంపెనీలు పనిచేస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ ఎదుగుదలలో స్థానిక స్టార్టప్స్, ఎంఎస్ఎంఈలు, పరిశ్రమల సహకారం కీలకమని అన్నారు.
ఈ సమ్మిట్‌లో డాక్టర్ డి. నాగేశ్వర రెడ్డి, డాక్టర్ రాజేశ్ కలపల, డాక్టర్ జీవీ రావు, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ బయోడిజైన్ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ మైరల్‌తో పాటు పలు దేశాల వైద్య నిపుణులు పాల్గొన్నారు.
