మిత్రుడికి అండగా స్నేహితులు

కౌకుంట్ల, ఆంధ్రప్రభ : కౌకుంట్ల మండలం రేకులంపల్లి గ్రామానికి చెందిన వై. ఆంజనేయులు భార్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కుటుంబానికి ఆధారంగా ఉన్న తల్లి లేకపోవడంతో చిన్న పిల్లల భవిష్యత్తు, వారి చదువులపై ఆందోళన నెలకొంది.
ఈ విషయం తెలుసుకున్న ఆంజనేయులుతో కలిసి చదువుకున్న 2000–2001 బ్యాచ్ స్నేహితులు మానవీయ కోణంలో స్పందించారు. తమ మిత్రుడి కష్టాన్ని పంచుకోవాలనే భావంతో అందరూ కలిసి ముందుకు వచ్చి పిల్లల విద్యాభ్యాసానికి తోడ్పాటుగా రూ.55 వేలు ఆదివారం అందజేశారు.
కష్టకాలంలో మిత్రుడికి అండగా నిలిచి కుటుంబానికి ధైర్యం చెప్పిన ఈ సహాయం గ్రామంలో ప్రశంసలు అందుకుంటోంది. స్నేహబంధం ఎంత విలువైనదో ఈ సంఘటన మరోసారి చాటిచెప్పింది. పిల్లల భవిష్యత్తు కోసం తమ వంతు బాధ్యతగా సహాయం చేసిన స్నేహితుల ఈ చర్య సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కష్టాల్లో ఉన్నవారికి తోడుగా నిలబడాలి అనే సందేశాన్ని ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తోంది.
