French Open : ఉత్కంఠ పోరులో కార్లోస్ అల్కరాజ్ కే ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్

పారిస్ : స్పెయిన్ యువ టెన్నిస్ దిగ్గజం కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) ఫ్రెంచ్ ఓపెన్ 2025 (French Open)టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో వరల్డ్ నం.1 ఆటగాడు జెన్నిక్ సిన్నర్‌ (Jannik Sinner)ను 5 సెట్ల భారీ పోరులో మట్టికరిపించి, తన ఫ్రెంచ్ ఓపెన్ విజయపరంపరను మరోసారి కొనసాగించాడు.

ఫైనల్ మ్యాచ్ మొత్తం 5 గంటల 29 నిమిషాలపాటు సాగింది. మొత్తానికి మ్యాచ్ ఫలితం చివరికి 4-6, 6-7(4-7), 6-4, 7-6(7-3), 7-6(10-2) స్కోర్లతో తేలింది.

మొదటి రెండు సెట్లలో అల్కరాజ్ వెనుకబడినప్పటికీ, మిగతా మూడు సెట్లను గెలుచుకొని గొప్ప కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఫైనల్ పోరు ఒక్కో పాయింట్‌ ఒక్కో గేమ్ పాయింట్ గా సాగి ఉత్కంఠను పంచింది.

మ్యాచ్ ఆరంభంలో జెన్నిక్ సిన్నర్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. మొదటి సెట్లో 10వ గేములో అల్కరాజ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 6-4తో గెలిచాడు. రెండో సెట్‌ లోనూ ఆరంభంలో 3-0 లీడ్ తీసుకున్నప్పటికీ, అల్కరాజ్ పుంజుకుని సెట్‌ను టై బ్రేకర్‌కు తీసుకెళ్లాడు. కానీ, అక్కడ సిన్నర్ 7-4తో విజయాన్ని అందుకున్నాడు. అలా రెండు సెట్లు కోల్పోయిన తర్వాత అల్కరాజ్ నుంచి ఓ అద్భుతమైన ఆట తీరు బయటకు వచ్చింది.

మూడో సెట్‌ను 6-4తో గెలిచి మ్యాచ్‌ లోకి తిరిగొచ్చాడు. నాలుగో సెట్‌ను ట్రై బ్రేకర్‌లో 7-6(7-3)తో కైవసం చేసుకున్నాడు. దీంతో మ్యాచ్ నిర్ణయాత్మక ఐదో సెట్‌కు దారితీసింది.

ఐదో సెట్‌లో కూడా ఇద్దరి మధ్య పోరు సమంగా సాగింది. చివరకు సెట్ మళ్లీ టై బ్రేకర్‌కు వెళ్లగా, అల్కరాజ్ 10-2తో ఘన విజయం సాధించాడు. ఈ గెలుపుతో అతను వరుసగా రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని ముద్దాడాడు. ఈ విజయంతో కార్లోస్ అల్కరాజ్ తన ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

ఇప్పటికే అతను యూఎస్ ఓపెన్ (2022), వింబుల్డన్ (2023, 2024), ఫ్రెంచ్ ఓపెన్ (2024) టైటిల్స్‌ను గెలుచుకున్నాడు. .

Leave a Reply