పిఎం సూర్య ఘర్ పథకంతో ఉచిత విద్యుత్…
100 శాతం అమలు చేస్తే గ్రామ అభివృద్ధికి కోటి రూపాయల నిధులు…
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా…
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : పిఎం సూర్య ఘర్ పథకం ద్వారా రూఫ్‌టాప్ ఉన్న ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేయడం ద్వారా కుటుంబాలకు సుమారు 25 సంవత్సరాలపాటు ఉచిత విద్యుత్ లభించే అవకాశం ఉందని, ఈ విషయంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి (Collector G.Rajakumari) పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ హాలులో జరిగిన కార్యక్రమంలో పిఎం సూర్య ఘర్ పథకం అమలు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ (Kollabathula Karthik), డిఆర్ఓ రాము నాయక్, విద్యుత్ శాఖ ఎస్ఈ సుధాకర్, డిప్యూటీ కలెక్టర్లు, ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…. పిఎం సూర్య ఘర్ పథకం కింద రూఫ్‌టాప్ ఉన్న ప్రతి కుటుంబం ఇంటిపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉచిత విద్యుత్తుతో పాటు, ఉత్పత్తి అయిన అదనపు విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానం చేయడం ద్వారా ఆదాయాన్ని కూడా పొందవచ్చని వివరించారు. జిల్లాలో ఈ పథకం అమలుకు భాగంగా ఐదు మండలాల్లో ఐదు గ్రామాలను మోడల్‌గా ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సిరివెళ్ల మండలంలోని గోవిందపల్లె, వెలుగోడు మండలంలోని వేల్పనూరు, బనగానపల్లె మండలంలోని నందవరం, నందికొట్కూరు మండలంలోని వడ్డెమాను, డోన్ మండలంలోని చిన్న మల్కాపురం… ఈ గ్రామాల్లోని ప్రతి ఇంటికీ రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేసే పనులను ఆరు నెలల కాలవ్యవధిలో 100% పూర్తి చేస్తే, సదరు గ్రామానికి కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయల అభివృద్ధి నిధులు మంజూరు చేస్తుందని కలెక్టర్ వెల్లడించారు.
ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం కోసం సంబంధిత మండల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, నియోజకవర్గ స్పెషల్ అధికారులు ప్రతి గ్రామాన్ని మోడల్‌గా మార్చే దిశగా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే, సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటుకు గృహ లబ్ధిదారులు బ్యాంకుల ద్వారా రుణాలు పొందే సౌకర్యం కూడా అందుబాటులో ఉందని కలెక్టర్ వివరించారు. అధికారులు ప్రజలకు పథకం ప్రయోజనాలను వివరించి, ప్రతి ఇంటిని ఈ కార్యక్రమంలో భాగం చేసేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.

