Foxconn | హైదరాబాద్ ఆపిల్‌ ఎయిర్‌పాడ్‌ల ఉత్పత్తి !

ఐఫోన్ల తయారీ కంపెనీ ఆపిల్‌ హైదరాబాద్‌లోఉన్న ఫాక్స్‌కాన్‌ ప్లాంట నుంచి ఎయిర్‌పాడ్‌ల ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఈ ఏప్రిల్‌లో వీటి ఉత్పత్తి ప్రారంభించి, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయనుంది. భారత్‌ నుంచి ఐఫోన్ల తరువాత యాపిల్‌ చేస్తున్న రెండో ఉత్పత్తి ఎయిర్‌పాడ్స్‌. ప్రస్తుతం ఎయిర్‌పాడ్‌ల ఉత్పత్తి కేవలం ఎగుమతుల కోసమే చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

2023 ఆగస్టులో ఫాక్స్‌కాన్‌ 3,500 కోట్లతో హైదరాబాద్‌లో ఎయిర్‌పాడ్‌ల ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణానికి అనుమతులు పొందింది. ట్రూ వైర్‌లెస్‌ డివైజ్‌ల ఉత్పత్తిలో ఆపిల్‌ ప్రపంచ మార్కెట్‌ లీడర్‌గా ఉంది. 2024లో ఆపిల్‌కు ఈ విభాగంలో 23.1 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉంది. రెండో స్థానంలో ఉన్న శాంసంగ్‌కు 8.5 శాతం మార్కెట్‌ వాటా ఉంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికాలోకి వచ్చే దిగుమతులపై ప్రతీకార సుంకాలు విధిస్తామని ప్రకటించడంతో ఇండియాలో కూడా ఆపిల్‌ తన ఉత్పత్తిని తగ్గించుకోవచ్చని వార్తలు వచ్చాయి. వచ్చే నాలుగు సంవత్సరాల్లో అమెరికాలో 500 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు యాపిల్‌ ప్రకటించింది.

ఈ కారణంతో కూడా బయటి దేశాల్లో ఉత్పత్తిని తగ్గించవచ్చని భావించారు. అయితే ముందు అనుకున్న విధంగానే ఇండియా ప్లాంట్‌ నుంచి ఎయిర్‌పాడ్‌ల ఉత్పత్తి, ఎగుమతులను కంపెనీ ప్రారంభించనుంది. ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) తెలిపిన వివరాల ప్రకారం హియర్‌బుల్స్‌, వేరబుల్స్‌పై భారత్‌ 20 శాతం దిగుమతి సుంకాలు విధిస్తోంది.

వీటిపై అమెరికా ఎలాంటి సుంకాలు విధించడంలేదు. అమెరికా నుంచి వచ్చే స్మార్ట్‌ ఫోన్లు, హియరబుల్స్‌, వేరబుల్స్‌పై దిగుమతి సుంకాన్ని రద్దు చేస్తే, భారత్‌ లాభపడుతుందని ఐసీఈఏ ప్రతిపాదించింది. భారత్‌పై ప్రతీకార సుంకాలను ఏప్రిల్‌ 2 నుంచి అమలు చేయనున్నట్లు ఇప్పటికే ట్రంప్‌ ప్రకటించారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఐసీఈఏ ఈ ప్రతిపాదన చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *