ELECTRIC SHOCK |నలుగురికి కరెంట్ షాక్ !

- ఒకరి పరిస్థితి విషమం
Electric shock | ఉయ్యూరు, ఆంధ్రప్రభ : ఉయ్యూరు పట్టణంలో ఆదివారం జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు యువకులు విద్యుత్ ఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. అయ్యప్ప పడి పూజ కార్యక్రమం కోసం స్థానిక శివాలయం ఎదురుగా ఉన్న కొబ్బరికాయల దుకాణంపై బ్యానర్ కడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా అది పైన ఉన్న విద్యుత్ తీగలకు తగలడంతో నలుగురు యువకులు గాయపడ్డారు. ప్రాథమిక చికిత్స కోసం ఇద్దరిని 108 అంబులెన్స్‌లో ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
మరో ఇద్దరిని ఆటోలో ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా, ఆసుపత్రి ప్రాంగణంలోనే ఆటో ఒక్కసారిగా పల్టీ కొట్టింది, దీంతో వారు రెండోసారి తీవ్రగాయాలపాలయ్యారు. నలుగురినీ మెరుగైన వైద్య సేవల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉయ్యూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ టీవీ.వి. రామారావు తెలిపారు.
