• తెలంగాణ అభివృద్ధిలో గేమ్​ ఛేంజర్!
  • ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం
  • 173 కి.మీ. ప్రాజెక్టు రూ.5,102 కోట్ల వ్యయం
  • తెలంగాణలో తొలి అంతర్రాష్ట్ర మల్టీ ట్రాకింగ్‌ ప్రాజెక్టు


హైదరాబాద్ : తెలంగాణ (Telangana) రాష్ట్రం నుంచి మొదటిసారిగా నాలుగు లైన్ల అంతర్రాష్ట్ర రైలుమార్గం నిర్మాణం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన దిల్లీలో బుధవారం జరిగిన కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ రూ.12,318 కోట్ల విలువైన నాలుగు రైల్వే ప్రాజెక్టులను ఆమోదించింది. అందులో సికింద్రాబాద్‌ (సనత్‌నగర్‌) – వాడి మధ్య మల్టీ ట్రాకింగ్‌ నిర్మించేందుకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. రూ.5,102 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును ఐదేళ్ల కాలవ్యవధిలో పూర్తి చేయాలన్నది లక్ష్యం. 2026 కేంద్ర బడ్జెట్ (Budget2026) లో ఇందుకోసం నిధులు కేటాయిస్తారు. ప్రస్తుతం ఈ మార్గంలో డబుల్‌ ట్రాక్‌ ఉంది. కేంద్రప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో మూడో, నాలుగో మార్గం (క్వాడ్రాప్లింగ్‌) పనులను చేపట్టనున్నారు. ఇది పూర్తయినట్లయితే రాష్ట్రం నుంచి ముంబయి వైపు రైళ్లు వడివడిగా పరుగులు పెట్టనున్నాయి. మరిన్ని కొత్త ట్రైన్లు కూడా వచ్చే అవకాశం ఉంది.

రద్దీ మార్గం : సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే స్టేషన్​ నుంచి మహారాష్ట్రలోని పుణెకు వెళ్లే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ సహా ముంబయి వెళ్లే హుస్సేన్‌సాగర్, ఎల్‌టీటీ ముంబయి తదితర ట్రైన్లు వికారాబాద్, వాడి రూట్​లో రాకపోకలు సాగిస్తాయి. ఈ మార్గం నిత్యం 122 శాతానికిపైగా ఆక్యుపెన్సీ రేషియోతో(ప్రయాణికులు) కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ మార్గంలో అనేక సిమెంటు పరిశ్రమలు ఉండగా వివిధ ప్రాంతాలకు వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంటు, ఉక్కు రవాణా అవుతాయి. మొత్తం 173 కిలోమీటర్ల మేర క్వాడ్రాప్లింగ్‌ చేయనుండగా 49 కిలోమీటర్లు కర్ణాటకలో, 124 కి.మీ తెలంగాణ రాష్ట్రంలో ఉంది.

తెలంగాణ మౌలిక వసతుల అభివృద్ధి : సికింద్రాబాద్‌-వాడి మూడు, నాలుగో లైన్ల ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని, రైల్వేల్లో తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నిరంతరం సహకరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

అంతరాయం లేకుండా రైలు ప్రయాణాలు : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) లోని తాండూరు, ధారూర్, వికారాబాద్, బషీరాబాద్, మంతటి, రుక్మాపూరు, గోధుమగూడ రైల్వే స్టేషన్ల నుంచి ఇక అంతరాయం లేకుండా రైలు ప్రయాణాలు సాగనున్నాయి. దీనికితోడు సరకు రవాణా(గూడ్స్) రైళ్లు నిర్ణీత స్టాప్‌లో తప్ప ఎక్కడా ఆగవు. ప్రయాణికులు (Passengers), సరకు రవాణాకు ప్రయోజనం కలిగేవిధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కర్ణాటక, తెలంగాణ, బిహార్, అసోం రాష్ట్రాల్లో మల్టీ ట్రాకింగ్‌తోపాటు సుదూర ప్రాంతాన్ని అనుసంధానించే రైల్​ నెట్​వర్క్​ను నిర్మించడానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ బుధవారం కీలక నిర్ణయం తీసుకొంది. ఇందులో భాగంగానే సికింద్రాబాద్‌- వాడి మార్గంలో కొత్తగా 3, 4వ లైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

సిమెంటు కర్మాగారాలకు ప్రయోజనం : కొత్తగా మరో రెండు రైల్వేలైన్ల నిర్మాణంతో తాండూరు (Tandoor) లోని సిమెంటు పరిశ్రమలకు మరింత ప్రయోజనం చేకూరనుంది. తాండూరు సమీపంలో సీసీఐ, ఇండియా సిమెంట్స్, పెన్నా సమీపంలోని కర్ణాటక రాష్ట్రంలో వికాట్‌సాగర్, చెట్టినాడు సిమెంటు కర్మాగారాలున్నాయి. వీటికి సికింద్రాబాద్‌- వాడి రూట్​ నుంచే గూడ్స్ ట్రైన్ల ద్వారా బొగ్గు, క్లింకర్‌ తదితర ముడి సరకు దిగుమతి అవుతుంటుంది. కర్మాగారాల్లో ఉత్పత్తి అయిన సిమెంటు గూడ్సురైళ్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు (other states) తరలిస్తారు. లైన్లు పెరగనుండడం వల్ల రవాణా మరింత వేగవంతం కానుంది. ప్రజల ప్రయాణాలకు ఇబ్బందులు తొలగనున్నాయి.

ప్రస్తుతం రెండే లైన్లు : సికింద్రాబాద్‌- వాడి రూట్​లో ప్రస్తుతం రెండు లైన్లు మాత్రమే ఉన్నాయి. ప్రయాణికుల ట్రైన్లు రాకపోకలు సాగించే వేళ గూడ్సు ట్రైన్లు గంటల తరబడి ఆగాల్సి వస్తోంది. కొన్నిసార్లు ప్రయాణికుల రైళ్లు కూడా స్టేషన్‌లోనే నిలిచిపోతున్నాయి. ఇలాంటి సమస్యల పరిష్కారానికి 1, 2వ లైన్లకు అదనంగా 3, 4 నిర్మించనున్నారు. రెండు లైన్లపై నుంచి ప్రయాణికులకు సంబంధించినవి, మరో 2 లైన్లపై గూడ్సు రైళ్లు రాకపోకలు సాగిస్తాయని రైల్వేశాఖ ఇంజినీరు (Railway Engineer) తెలిపారు.

Leave a Reply