3175cr | రాష్ట్ర ప్రభుత్వం పైసా ఇవ్వలే..

3175cr | రాష్ట్ర ప్రభుత్వం పైసా ఇవ్వలే..
- పైగా గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు
- మాజీ ఎంపిపి బిజెపి రాష్ట్ర నాయకులు కొండయ్య
మక్తల్ , ఆంధ్రప్రభ : మహబూబ్ నగర్ -గుడెబల్లూర్ వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం 167వ జాతీయ రహదారి విస్తరణకు రూ .3175 కోట్లు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులేనని మక్తల్ మాజీ ఎంపీపీ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా మహారాష్ట్ర, గుజరాత్ ,తెలంగాణ రాష్ట్రాల్లో 11 వేల కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు . మంగళవారం నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలో బిజెపి పట్టణ అధ్యక్షులు బి. రాజశేఖర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరిస్తుందని అన్నారు.
ముఖ్యమంత్రి సహా మంత్రులంతా వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి తప్ప రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోవడంలేదని అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన, రవాణా వ్యవస్థ విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ,మహారాష్ట్ర, గుజరాత్ లో దాదాపు 11 వేల కోట్ల విలువైన పలు రహదారులు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అన్నారు. ఇందులో భాగంగా మన ఉతెలంగాణలోని హైదరాబాద్ నుండి పనాజీ ఎకనామిక్ కారిడార్ లో భాగమైన గుడెబల్లూరు నుండి మహబూబ్నగర్ మధ్య 3,175 కోట్ల రూపాయలతో జాతీయ రహదారి 167 విస్తరణకు ఆమోదముద్ర తెలిపిందని అన్నారు. దాదాపు 80 కిలోమీటర్ల ఈ రహదారిని 3175 కోట్ల వ్యయంతో నాలుగు వరసల రహదారిగా విస్తరించనున్నారని అన్నారు.
ఈ రోడ్డు పూర్తయితే రవాణా వ్యవస్థ మెరుగుపడి ఈ ప్రాంతము అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మక్తల్ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నామని అన్నారు.కేంద్ర ప్రభుత్వము ఈ రోడ్లకు నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్ వారు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. రాబోయే కాలంలో తెలంగాణను మరింత అభివృద్ధి చేయడానికి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము ముందుంటుందని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు,420 హామీలను అమలుపరిచేందుకు చొరవ చూపాలని అన్నారు. మక్తల్ మున్సిపాలిటీ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2019 సంవత్సరం నుంచి 2025 వరకు దాదాపు 8 కోట్ల రూపాయల ను 15వ ఫైనాన్స్ నిధుల నుండి ఇవ్వడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటినుండి ఇంతవరకు ప్రభుత్వం నుండి రావలసిన నిధులు రాలేదని అన్నారు.
రేవంత్ ముఖ్యమంత్రి లా వ్యవహరించు……
దేశ ప్రధానమంత్రి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటతీరు అభ్యంతరకరంగా ఉందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య అన్నారు. దేశ ప్రధాని నరేంద్రమోడీ పట్టుకుని ఏక వచనంతో మాట్లాడటం దారుణం అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నారు మోడీ వచ్చి మోర్లు తీస్తాడా అంటూ వ్యంగంగా మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చి మాట్లాడడమేనని అన్నారు. ఒక ముఖ్యమంత్రి లా కాకుండా జేబుదొంగల మాట్లాడడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా మాట తీరు మార్చుకోవాలని రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి చిల్లర వ్యక్తుల్లా మాట్లాడడం మానుకొని హుందాగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు .
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపికి సహకరించాలి…….
మక్తల్ మున్సిపల్ రెండవ సాధారణ ఎన్నికల సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన ఎరుకలి మహాదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని అక్కడ తిరిగి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతున్నందున మృతుడి భార్య ఎరుకలి సత్యమ్మను బిజెపి అభ్యర్థిగా పోటిలో ఉంటారని ఎన్నికల్లో బిజెపికి కాంగ్రెస్ పార్టీ సహకరించాలని బిజెపి రాష్ట్ర నాయకులు కొండయ్య విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి 12 స్థానాలు ఉన్నందున వారికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదని ఎరుకలి మహాదేవప్ప కేవలం కొందరి ఒత్తిడిలో బెదిరింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నారన్నది వాస్తవమని అన్నారు. అందుకు సంబంధించిన పూర్తి నిజాలు కూడా ఆదారలతో సహా త్వరలోనే బయటకు వస్తాయని అన్నారు .మున్సిపాలిటీలో ఈ ఒక్క సీటు వల్ల కాంగ్రెస్కు వచ్చే లాభం కానీ నష్టం కానీ ఏమీ లేదని ఎరుకలి మహాదేవప్ప ఆత్మ శాంతించాలని అందుకు ఈ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా ఆయన భార్య ఎరుకలి సత్యమ్మ బరిలో ఉంటారని ఆమె గెలుపు కోసం చందాపూర్, తిర్లాపూర్ గ్రామాల ప్రజలు పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వాలని కోరారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు సహకరించాలని కొండయ్య విజ్ఞప్తి చేశారు. ఈ విలేఖరుల సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.బలరాం రెడ్డి,నాయకులు దేవరింటి నరసింహారెడ్డి, కురువ హనుమంతు,కావలి వెంకటేష్, కౌన్సిలర్లు బి.రాజశేఖర్ రెడ్డి, టప్ప కృష్ణ ,బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి నరేందర్,నాయకులు నగరేష్, కావలి సత్యనారాయణ,అంజన్ ప్రసాద్, ఆంజనేయులు, బ్యాటరీ రాజు, హనుమంతు, కథలప్ప, బాలప్ప తదితరులు పాల్గొన్నారు.
