• త్వరలోనే ఆ జాతీయ పార్టీలో చేరుతారని సమాచారం..
  • చేరికకు లైన్ క్లియర్..?
  • కార్యకర్తతో గువ్వల మాట్లాడిన ఆడియో లీక్.. వైర‌ల్


ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ (BRS party) కి మరో భారీ షాక్ ఇస్తూ.. మాజీ ఎమ్మెల్యే (Former MLA) గువ్వల బాలరాజు (Guvvala Bala Raju) సోమవారం తన రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నుంచి ఎమ్మెల్యేగా గువ్వల గెలుపొందిన విష‌యం తెలిసిందే. మొదటి నుంచీ దూకుడు స్వభావమున్న గువ్వల.. పార్టీ అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉంటూ వచ్చారు. గత కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాల్లో (Party programme) నామమాత్రంగా పాల్గొంటూ వచ్చిన గువ్వల అధిష్టానంతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రిజర్వుడుగా ఉన్న అచ్చంపేట నియోజకవర్గం (Achampeta Constituency) జనరల్ గా మారే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేప‌థ్యంలో గువ్వల రాజీనామా రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పార్టీలో కీలకపాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరుతున్నారనే వార్త హల్చల్ చేస్తోంది. 2010లో గువ్వల ఒక సామాన్య కార్యకర్తగా అచ్చంపేట ప్రాంతం నుంచి ఉద్యమంలో తనవంతు పాత్ర పోషించారు. రెండు పర్యాయాలు అచ్చంపేట శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. అంతకుముందు నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2019 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచాక బీఆర్ఎస్ పార్టీ ఆయనకు ప్రభుత్వ విప్ (Government Whip) అవకాశం ఇచ్చింది. అయితే 2024 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వంశీకృష్ణ (Dr. Vamsi Krishna) చేతిలో ఓటమి పాలయ్యారు. ఇంతటి రాజకీయ ప్రస్థానం కలిగిన గువ్వల సోమవారం బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెబుతూ, పార్టీ అధినేత కేసీఆర్ కు రాజీనామా లేఖ (Resignation letter) ను అందించారనే చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా గువ్వల అధికారిక ప్రకటన చేయలేదు.

రానున్న శాసనసభ స్థానాల సమీకరణనో లేక ఇతర కారణాలో గానీ, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ (BJP) పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ (line Clear) చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా బాలరాజు నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో ఫోన్ లో మాట్లాడుతూ… తాను పార్టీ మారుతున్నానని, ఎవరైనా వచ్చే వాళ్లు ఉంటే తనతో రావచ్చని ఆహ్వానించారని సమాచారం. అయితే ఆయన ఆశించిన స్థాయిలో కిందిస్థాయి నేతలు అతనితో వెళ్లేందుకు సానుకూలంగా లేరనే టాక్ వినిపిస్తోంది.

‘అన్నా నమస్తే.. బీజేపీలోకి పోతున్నారని వార్తలు వస్తున్నాయి.. నిజమేనా?’ అని అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన ఒక కార్యకర్త మాజీ ఎమ్మెల్యే గువ్వలను ఫోన్ లో అడగగా.. ‘కరెక్టే తమ్మీ.. పొద్దున్నే రాజీనామా చేసిన.. బీఆర్ఎస్ (BRS) బీజేపీ ( BJP) తో పొత్తు అంటున్నారు. విలీనం చేయాలని చూస్తున్నారు.. అప్పటిదాకా మనం ఆగితే పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు.. ముందే మనం చేరితే సరిపోతుంది కదా’ అని సమాధానం ఇచ్చిన ఆడియో (Audio) ఒకటి వైర‌ల్ గా మారింది. చూడాలి మ‌రి ఆయ‌న ఎటువైపు చేరుతారో..!

ఇదిలా ఉండ‌గా.. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు (Many MLAs) బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయింగా.. ప్రస్తుతం బంతి స్పీకర్ కోర్టులో ఉంది. మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీం చెప్పింది. అంతేకాకుండా పలువురు కీలక నేతలు సైతం ఇతర పార్టీల్లోకి వెళ్లారు. ఇప్పుడు గువ్వల బాలరాజు సైతం ఆ లిస్ట్‌లో చేరారు. అయితే ఎవరు పోయిన పార్టీకి వచ్చిన నష్టం ఏమిలేదని గతంలో కేటీఆర్ (KTR) వ్యాఖ్యానించారు. తాజాగా గువ్వల రాజీనామాపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Leave a Reply