రాష్ట్రంలో కల్తీ ప్రభుత్వం.. అరాచక, కల్తీ పాలన

రాష్ట్రంలో కల్తీ ప్రభుత్వం.. అరాచక, కల్తీ పాలన
- ప్రజాబలం లేక మేనేజింగ్ పాలిటిక్స్ చంద్రబాబు నైజం
- తప్పులు చేయడం.. ఇతరులపై మోపడం ఆయనకే అలవాటు
- డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు
- దళితులు, బీసీలంటే ఈ ప్రభుత్వానికి చిన్నచూపు
- లడ్డూ పాపం కూటమి ప్రభుత్వం అనుభవించక తప్పదు
- మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కల్తీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం కాకుండా అరాచక, కల్తీ పాలన సాగిస్తుందని మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇటీవల టీడీపీ నాయకుల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని ఆయన పరిశీలించారు. జోగి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దాడికి సంబంధించిన విజువల్స్ ను జోగి ఆయనకు చూపించారు.
ప్రజాబలం లేక మేనేజింగ్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబు నైజం అన్నారు. ప్రతి విషయాన్ని కల్తీ చేస్తూ.. మోసం చేస్తూ ఇతరులపై తప్పులను మోపడం చంద్రబాబుకు అలవాటైపోయిందని దుయ్యబట్టారు. కల్తీ మాటలతో విష ప్రచారం చేస్తూ తిరుపతి లడ్డూ విషయంలో దొరికిపోయారని చెప్పారు. వై.ఎస్.రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, వారిద్దరూ హిందువుల మనోభావాలను ఎంతో గౌరవించారని చెప్పారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేశారని ఆరోపించారు. దళితులు, బీసీలు అంటే ఈ ప్రభుత్వానికి చిన్నచూపు అన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీసీలపై ఈ విధమైన దాడులు జరగలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలపై దాడులు పెరిగాయని రామచంద్ర యాదవ్ చెప్పారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల రక్షణకు బలమైన చట్టాలు తీసుకొస్తామని స్పష్టం చేశారు. హింసను ప్రోత్సహించడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి లడ్డూపై ఇంత నీచంగా వ్యవహరించడం కూటమి ప్రభుత్వానికి తగదన్నారు. మోసపూరితమైన పాలనను ప్రజలు గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తిరుపతి లడ్డూ విషయంలో చేసిన పాపం కూటమి ప్రభుత్వం అనుభవించక తప్పదన్నారు.
