అధికారుల తీరుపై మాజీ మంత్రి ఫైర్
నిబంధనల మేరకు వార్డు సభలు నిర్వహించాలి
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి
మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి
జగిత్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : మీ అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ (Telangana) ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది అని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అధికారుల తీరుపై మండి పడ్డారు. గురువారం జగిత్యాల పట్టణంలో ముందస్తు సమాచారం ఇవ్వకుండా వార్డు సభలు నిర్వహించి, కొందరికి మాత్రమే ఇండ్లను కేటాయించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి (JeevanReddy) మాట్లాడుతూ… నిబంధనలకు విరుద్ధంగా వార్డు సభలను ఎలా నిర్వహిస్తారని అధికారులను ప్రశ్నించారు.
ఎంపిక చేసిన అర్హులతో పాటు, అన్హరులుగా గుర్తించబడిన వారి వివరాలతో లిస్టు ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. నిబంధనల మేరకు వార్డు సభలు నిర్వహించాలని సూచించారు. డబుల్ బెడ్ రూమ్ (Double bedroom) ఇండ్ల నిర్మాణ సమయంలో స్థలాలు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రెవెన్యూ, హౌసింగ్ శాఖల నుంచి నివేదిక తెప్పించుకొని అర్హులను గుర్తించాలని, పట్టణంలోని అన్ని వార్డుల్లో మళ్లీ వార్డు సభలను నిర్వహించి, అర్హులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. అనంతరం కమిషనర్ కు వినతిపత్రం అందించారు.

