Forest Range | చెట్లు నరికేందుకు అనుమతి తప్పనిసరి
- తాళ్లపేట రేంజ్ ఆఫీసర్ సుష్మారావు
Forest Range | జన్నారం, ఆంధ్రప్రభ : వాల్టా చట్టం ప్రకారం ఇండ్ల పరిసరాల్లో, పంట చేన్లలో చెట్లను నరికేందుకు తప్పనిసరి అటవీ శాఖచే ముందస్తు అనుమతి తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కవ్వాల టైగర్ రిజర్వ్ లోని తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్(Forest Range) ఆఫీసర్ వి.సుష్మారావు తెలిపారు.
ఈ రోజు సాయంత్రం ఆమె మాట్లాడుతూ… వాల్టా చట్టం అమలలో ఉందన్నారు. రైతులు తమ పొలాల, చేన్లు గట్లపై, ఇంటి పరిసర ప్రాంతాల్లో పెంచిన టేకు, వేప, తుమ్మ, జిట్రేగి, దిర్శినం, బిల్లుడు, తదితర చెట్లను నరికివేయడానికి, ఇతర ప్రాంతాలకు తరలించడానికి ముందస్తుగా అటవీ శాఖ అనుమతి తప్పనిసరిగా పొందాలన్నారు. తాము పెంచుకున్న చెట్లపై పూర్తి అధికారం ఉందని భావిస్తూ అనుమతి లేకుండా చెట్లు నరికే, తరలించే ఘటనలు గమనించడం జరిగిందని ఆమె చెప్పారు.
వాల్టా చట్టం ప్రకారం(according to law) పెంచిన చెట్లను తొలగించాలంటే ముందుగా ఆన్‌లైన్ ద్వారా తమ భూమిలో తొలగించబోయే చెట్ల సంఖ్య, వివరాలు నమోదు చేసుకోవాలని ఆమె తెలిపారు. అనంతరం ఒక్కో చెట్టుకు రూ.500 చొప్పున అటవీ శాఖ పేరుతో డిపాజిట్ చెల్లించాలని, సంబంధిత అనుమతులు పొందిన తరువాత మాత్రమే తొలగించిన కలపను ఎక్కడికైనా తరలించుకోవడానికి అవకాశం ఉంటుందని, చెట్లు తొలగించిన అనంతరం ఒక చెట్టుకు బదులుగా రెండు చెట్లు నాటి, వాటిని మూడేళ్ల పాటు సంరక్షించినట్లయితే, అటవీ శాఖ పరిశీలన అనంతరం చెల్లించిన అనుమతి డిపాజిట్ మొత్తాన్ని రైతులకు, ఆ యజమానులకు తిరిగి చెల్లించనున్నట్లు ఆమె చెప్పారు. లేనిపక్షంలో వాల్టా చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తూ అనుమతి లేకుండా చెట్లు నరికిన, అక్రమంగా కలపను తరలించిన వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు(action as per law) తీసుకోనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

