ADB | కవ్వాల అడవుల్లో చెట్ల నరికివేత.. చోద్యం చూస్తున్న అటవీ అధికారులు

సుమారు 10 టేకు చెట్లు, సుమారు 2 లక్షలు..
జన్నారం, జూలై 2 (ఆంధ్రప్రభ): అటవీ అధికారుల (Forest officials) నిర్లక్ష్యంతో విలువైన టేకు కలపను మూకుమ్మడిగా రంపంతో కోసి, కొన్ని కలపను దుంగలను వదిలివేసి, మరి కొన్ని కలప దుంగలను స్మగ్లర్లు కొంతమంది అటవీ అధికారుల అండదండలతోనే ఇతర ప్రాంతాలకు తరలించినట్లు ఆరోపణలున్నాయి. సుమారు 10 టేకుచెట్ల కలప విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని బోగట్ట. ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని కవ్వాల టైగర్ రిజర్వ్ మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజనల్ పరిధిలోని ఇందనపల్లి రేంజు కవ్వాల సెక్షన్, అటవీ బీట్ లోని బోడగుట్ట ప్రాంతంలో మూకుమ్మడిగా పలు టేకు చెట్లను కలప స్మగ్లర్లు రంపంతో కోసి దుంగలుగా తయారుచేసి తరలించినట్లు సమాచారం.

ఆంధ్రప్రభకు ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం ఉదయం ఫోటోలను సేకరించింది. కవ్వాల అటవీ బీటులోని బోడగుట్ట అటవీ ప్రాంతంలో ముకుమ్మడిగా సుమారు 10 విలువైన టేకు చెట్లను కలప స్మగ్లర్లు నరికి వేసినట్లు,ఆ కలప విలువ రూ.2 లక్షలు ఉంటుందని సమాచారం.గతంలోనూ ఇదే అటవీ ప్రాంతంలో రహదారి కోసం కొమరం భీం ఆసిఫాబాద్ (Komaram Bheem Asifabad) జిల్లాలోని కొంతమంది విలువైన టేకు చెట్లను నరికి వేశారు. ఆ తరుణంలో ఆ ప్రాంతానికి వెళ్లిన అప్పటి కవ్వాల ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ (Lakshminarayana) గుండెపోటుకు గురై మృతిచెందారు.

కొంతమంది అటవీ అధికారుల అండదండలతో అదే ప్రాంతంలో మళ్లీ కలప స్మగ్లర్లు టేకు చెట్లను నరికి వేసినట్లు సమాచారం.ఆ టేకు చెట్ల కలుప విలువ సుమారు రూ.2లక్షలు ఉంటుందని తెలిసింది. ఈ వ్యవహారంలో కాలేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్ (Prabhakar), మంచిర్యాల జిల్లా సీఎఫ్, కవ్వాల టైగర్ రిజర్వ్ ఎఫ్డీపీటీ శాంతారాం (Shantaram) లు పూర్తి విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు. ఈ విషయమై స్థానిక ఎఫ్డీఓ ఎం.రామ్మోహన్ ను మధ్యాహ్నం ఫోనులో సంప్రదించగా, విలువైన 3 టేకుచెట్లను స్మగ్లరు నరికివేసినట్లు సమాచారం ఉందన్నారు. ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కారం శ్రీనివాస్ ఆ ప్రాంతానికి వెళ్లి, విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. బాధ్యులపై శాఖ పరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply