Mancherial | తహసీల్దార్ కార్యాలయం ఎదుట అటవీశాఖ అధికారుల హైడ్రామా

బైండోవర్ కు ఒప్పుకోని ఆదివాసీ మహిళలు


దండేపల్లి, జులై 17 (ఆంధ్రప్రభ): మంచిర్యాల (Mancherial) జిల్లా దండేపల్లి తహసీల్దార్ (Tahsildar) కార్యాలయం ఎదుట అటవీశాఖ అధికారులకు, ఆదివాసీ గిరిజన మహిళలకు మధ్య బుధవారం రాత్రి హైడ్రామా నడిచింది. కొత్తగా పోడు వ్యవసాయం చేస్తున్నారని చెప్పి ఆదివాసీ మహిళలను బైండోవర్ చేయడానికి ఆటవీశాఖ అధికారులు దండేపల్లి (Dandepally) తహశీల్దార్ కార్యాలయానికి తీసుకునివచ్చారు. తాము బైండోవర్ (bindover) కు అంగీకరించమని మహిళలు కార్యాలయం బయట బైఠాయించారు. చివరకు బైండోవర్ అంగీకరించకుండానే వెళ్లిపోయారు.

వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని లింగాపూర్ రిజర్వ్ ఫారెస్టు (Lingapur Reserve Forest) లో 380 కంపార్ట్ మెంట్ లో మాకులపేట పంచాయతీ పరిధిలోని రామునిగూడకు చెందిన కొంతమంది గిరిజన మహిళలు చెట్ల పొదలు తొలగించి ఇటీవల విత్తనాలు విత్తారు. దీంతో అటవీశాఖ అధికారులు 26మంది గిరిజన మహిళలపై కేసులు నమోదు చేశారు. బుధవారం 21మంది మహిళలను బైండోవర్ చేసేందుకు అటవీశాఖ అధికారులు దండేపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చారు. గిరిజనులు బైండోవర్ కావడానికి ఒప్పుకోలేదు. తహసీల్దార్ రోహిత్ దేశపాండే, ఎస్సై తహసీనోద్దీన్, అటవీశాఖ అధికారులు మాట్లాడి వారికి నచ్చజెప్పినప్పటికీ వినిపించుకోలేదు. కేసులు నమోదు చేశాక బైండోవర్ ఎందుకని అధికారులను గిరిజన మహిళలు నిలదీశారు. సుమారు మూడు గంటలపాటు వేచిచూసి రాత్రి ఎనిమిది గంటలకు తాము బైండోవర్ అయ్యేది లేదంటూ వెనుదిరిగి వెళ్లిపోయారు.

Leave a Reply