ఆ బాధ్యత అందరి పై ఉంది..
అచ్చంపేట (ఆంధ్రప్రభ) : సమైక్య భారతదేశ నిర్మాణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి స్ఫూర్తిదాయకమని, ఆయన సేవలు మరువలేనివని అచ్చంపేట డిఎస్పీ పల్లె శ్రీనివాసులు (Achampet DSP Palle Srinivasulu) అన్నారు. శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతిని పురస్కరించుకుని అచ్చంపేట పట్టణంలో డిఎస్పీ పల్లె శ్రీనివాసులు ఆధ్వర్యంలో 2కే రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. అచ్చంపేట పోలీస్ స్టేషన్ నుండి రాజీవ్ ఎన్టీఆర్ స్టేడియం వరకు కొనసాగిన 2 కే రన్ లో డిఎస్పీ పల్లె శ్రీనివాసులు, సిఐ నాగరాజు, పోలీస్ శాఖ సిబ్బంది, యువకులతో పాటు రెండు కిలోమీటర్ల వరకు పరుగు పందెంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిఎస్పీ పల్లె శ్రీనివాసులు మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) చేసిన త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశ ఐక్యతను, సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నదని గుర్తుకు చేశారు. నేటి యువత తమ ఆరోగ్య పరిరక్షణ కోసం వ్యాయామాన్ని, యోగాను దైనందిక జీవనంలో భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట సీఐ నాగరాజు, అమ్రాబాద్ సిఐ శంకర్, అచ్చంపేట ఎస్సైలు ఇందిర, సుధీర్ కుమార్, ఇతర పోలీస్ శాఖ సిబ్బంది, వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఎల్. చందు నాయక్, వాకర్స్, ప్రజా ప్రతినిధులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

